సాక్షి, హైదరాబాద్: బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ స్పష్టమైన వ్యతిరేక వైఖరి తీసుకుంటే, సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో చేరే విషయంపై ఆలోచించవచ్చని సీపీఐ జాతీయ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అయితే, టీఆర్‌ఎస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్ల అనుసరిస్తున్న తీరు మాత్రం ఆ దిశలో లేవని భావిస్తోంది. పవన్‌కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకుంటేనే ఏపీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జాతీయస్థాయిలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ‘మహాఘట్ బంధన్’ ఏర్పాటులో సీపీఐ తన వంతు కృషి చేయాలని తీర్మానించింది. సోమవారం ఇక్కడ మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై జరిగిన సమీక్షలో పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ఆయా అంశాలను వివరించినట్టు సమాచారం.
రాజ్యాంగ సంస్థలు ధ్వంసం: సురవరం
అన్ని రాజ్యాంగసంస్థలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీయే పాలనలో సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ వంటి రాజ్యాంగసంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఈ పాలనలో మతోన్మాదం పడగ విప్పుతోందని, మైనారిటీలు, దళితులపై దాడులు కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేలా ప్రజలు తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావొస్తున్నా పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ నియంతపాలన కొనసాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలకుగాను రాష్ట్రప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లేదా మహబూబాబాద్, నల్లగొండ లేదా భువనగిరి స్థానాల్లో పోటీకి సన్నద్ధమవుతున్నట్టు చాడ తెలిపారు. భేటీలో పార్టీ నేతలు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, గుండా మల్లేశ్, ఈర్ల నర్సింహ, పశ్య పద్మ, టి.శ్రీనివాసరావు, ఎ¯Œ..బాలమల్లేశ్ పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అఖిలపక్షం పిలవాలి
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సురవరం సుధాకరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఇటు పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక వైఖరి దేశాన్ని అంతర్యుద్ధ పరిస్థితుల వైపు నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు ఎంపీ సీట్లకు పోటీ...
లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నాయకులు, కేడర్‌ను సంసిద్ధం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం/మహబూబాబాద్, నల్లగొండ/ భువనగిరి స్థానాల్లో రెండింటికి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని తీర్మానించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో ప్రజాఫ్రంట్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత కొరవడిన నేపథ్యంలో సొంత ప్రయత్నాలు చేసుకోవాలనే అభిప్రాయానికి సీపీఐ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎంను కలుపుకొనిపోవాలని, బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) నుంచి బయటకు రావడానికి ఆ పార్టీ సిద్ధమైతే తదనుగుణంగా సీపీఐ కూడా వ్యవహరించాలని నిర్ణయించింది. శాసనసభ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు ప్రజాఫ్రంట్ కూటమిపరంగా సమీక్ష జరగనందున సీపీఐ చొరవ తీసుకుని కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీలతో సమావేశం కావాలని అభిప్రాయపడింది. లోక్‌సభ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment