
సాక్షి, హైదరాబాద్: రైతాంగాన్ని నాలుగేళ్లుగా పట్టించుకోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పేరిట హడావుడి చేస్తుండటం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం కేసీఆర్ రైతుబంధు కాదని, రైతు రాబందు అని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎకరానికి రూ.4 వేలు కాదని, రూ.40 వేలు ఇచ్చినా రైతుల ఉసురు కేసీఆర్‌కు తగలక మానదని వ్యాఖ్యానించారు.
రుణమాఫీ కాక 35 లక్షల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. 4,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని సీఎం ఇప్పుడు రైతుబంధు అంటూ వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి 24 లక్షల ఎకరాల సాగు భూమిని 45 లక్షల మంది రైతులు సాగు చేస్తుంటే.. కొత్తగా కోటి 39 లక్షల ఎకరాల్లో 58 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని, వారందరికీ చెక్కులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, కొత్తగా 13 లక్షల మంది రైతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. వీరికి చెక్కుల రూపంలో వెళుతున్న రూ.600 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment