
ప్రధాని మోదీతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : కథువా, ఉన్నావ్ ఉదంతాల నేపథ్యంలో శాంతిభద్రతల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరుమెదపాలన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మైనర్ బాలికలపై లైంగిక దాడులను ప్రధాని తీవ్రంగా ఖండించారని, ఇవి జాతికి సిగ్గుచేటని, అమానవీయ ఘటనలని అభివర్ణించారని ఆ పార్టీ స్పష్టం చేసింది. ప్రధాని ఏ అంశంపైనైనా ధృడంగా చెబుతారని, చర్యలు చేపడతారని.. మోదీ పాలనను దయచేసి మీ హయాంతో పోల్చుకోవద్దని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ తనను తరచూ మాట్లాడాలని సలహా ఇస్తుంటారని.. అయితే ఇప్పుడు తాను ఆయనకు ఈ సలహా ఇస్తున్నానని, ఇటీవల వెలుగుచూసిన శాంతిభద్రతల అంశాలపై మోదీ నోరువిప్పాలని మన్మోహన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మౌనం దాల్చితే తామెలాంటి పనిచేసినా ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకోవచ్చని ప్రజల్లో సంకేతాలు వెళతాయని అన్నారు. శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలు, దళితులు, మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేయాలని మన్మోహన్ డిమాండ్ చేశారు.