సమావేశంలో మాట్లాడుతున్న గద్దర్
ఒంగోలు వన్‌టౌన్: కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కారణంగా నోటుకు ఓటు కేసు నీరుగారిందని, ప్రారంభంలో సంచలనమైన ఈ కేసు తర్వాత కాలంలో సమసిపోయి ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వినిపిస్తోందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రథమ దోషి అయిన చంద్రబాబుకు ఈ పాటికి శిక్షపడేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. కేసీఆర్ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకుంటోంది నిజమేనన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తూ మార్గం మధ్యలో ఒంగోలులో విశ్రాంతి తీసుకున్నారు. విముక్తి చిరుతల కక్షి (వీసీకే) పార్టీ ఆధ్వర్యంలో నేడు చెన్నైలో జరిగే అవార్డు ప్రధాన కార్యక్రమానికి వెళుతున్న గద్దర్‌కు ఆ పార్టీ పెరియార్ అవార్ట్‌ను నేడు ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. గ్లోబలైజేషన్ వ్యవసాయాన్ని దారుణంగా దెబ్బతీసిందనీ, పెద్ద రైతులు సైతం చెక్కుల బిచ్చగాళ్లుగా మారుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. సాయుధ పోరాటం ఆగిపోలేదనీ, తాత్కాలికంగా ఆత్మరక్షణ íస్థితిలో మాత్రమే ఉందనీ అన్నారు.
ప్రత్యేక హోదా న్యాయంగా ఇవ్వాల్సిందే:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా న్యాయంగా ఇవ్వాలని గద్దర్ అన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కారణంగా గట్టిగా నిలదీయలేని దుస్థితి రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజలను కలుపుకుని ఉద్యమం చేయడం ద్వారా ప్రత్యేక హోదా సాధిం చాల్సిన చంద్రబాబు, నాలుగేళ్లు గడిచినా ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు అర్థమవుతోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను 9వ షెడ్యూల్‌లో పెట్టాలి
ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను కేంద్రం రాసిన నోట్ ప్రకార మే తీర్పు ఇచ్చామని సుప్రీం జడ్జిలు బహిరంగంగా మాట్లాడారని అన్నారు. అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుందనే కోణంలో పరిశీలించిన న్యాయమూర్తులు, ఈ చట్టం వల్ల కోట్ల మందికి రక్షణగా నిలిచిందనే కోణంలో ఎందుకు పరిశీలించలేదన్నారు. పాలక పెద్దలు ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను 9వ షెడ్యూల్‌లో పెట్టడం ద్వారా చట్టానికి రక్షణ కల్పించాలన్నారు.
మూడో ఫ్రంట్ మనుగడ ఉండదు:ప్రాంతీయ పార్టీలు రాజరికాన్ని అనుభవిస్తున్నాయని గద్దర్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకుని ముఖ్యమంత్రిని చేయగలడనీ, ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కూడా కొడుకును ముఖ్యమంత్రిని చేయగలడనీ వారి కాబినెట్‌లో సామాజికవేత్త, విద్యావేత్త అయిన ఏ మంత్రి ఏ పదవినైనా ఆశించవచ్చు కానీ ముఖ్యమంత్రి పదవి ఆశించడం కష్టం అని అన్నారు. అదే జాతీయ పార్టీలలో ఎవరికైనా అవకాశాలు వస్తాయని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడే ఏ ఫ్రంటైనా ఎన్నికల తరువాత మనుగడ కొనసాగించలేదన్నారు.
యువత మేల్కొనాలి: ప్రజాసంక్షేమం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ప్రభుత్వాలు సంక్షేమాన్ని రాజకీయ ప్రాభవంగా మార్చడంతో దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేశంలో 18–35 సంవత్సరాల యువత దేశం సమస్యలను వదిలి సెల్‌ఫోన్ మత్తులో జోగాడుతోందనీ వారు దేశాభివృద్ధికి కార్యసాధకులు కావాలన్నారు. విలేకరుల సమావేశంలో గద్దర్ వెంట దళిత సంఘాల నాయకులు నాగేంద్రరావు, విజయసుందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment