కేసును పక్కదారి పట్టించేందుకు పక్కా ప్లాన్
* ఉచ్చు బిగుస్తుండటంతో రోజంతా హైడ్రామా నడిపిన ఏపీ సీఎం చంద్రబాబు
* మంత్రులు, ఎంపీలు, అధికారులతో భేటీ
* తనకు నోటీసిచ్చే అధికారం లేదంటూనే మరోవైపు కేసీఆర్‌పై ఉన్న కేసులపై వాకబు
* యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందన్న మంత్రి యనమల.. ముల్లును ముల్లుతోనే తీస్తామన్న అచ్చెన్నాయుడు
* మేం కేసులు పెడితే కేసీఆర్ ప్రభుత్వం కూలుతుందంటూ హడావుడి
* సీఎస్, డీజీపీలను గవర్నర్ వద్దకు పంపిన బాబు
* ఏసీబీపై మైండ్‌గేమ్ కథ నడిపిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) మరో అడుగు ముందుకు వేయనుందన్న విషయం తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానాహడావుడి చేశారు. ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేయబోతోందన్న సమాచారం మంగళవారం సచివాలయంలో హైడ్రామా నడిపించారు. అసలు కేసును పక్కదారి పట్టించడానికి కొత్త ప్లాన్ రచించారు. ఏ క్షణంలోనైనా ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న సమాచారంతో ఉలిక్కిపడిన చంద్రబాబు మంగళవారం ఉదయం ఇంట్లోనే డీఐజీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధతోపాటు ఇతర ఉన్నతాధికారులతో రహస్య మంతనాలు సాగించారు.
మధ్యాహ్నం సచివాలయానికి రాగానే అందుబాటులో ఉన్న మధ్యాహ్నం సచివాలయానికి రాగానే గృహనిర్మాణంపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉన్న మంత్రులను, కొందరు ఎంపీలను హడావుడిగా పిలిపించి సుదీర్ఘ భేటీలు జరిపారు. యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, మృణాళిని, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు గరికపాటి రామ్మోహన్‌రావు, సీఎం రమేష్ తదితరులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ అనూరాధ ఇతర అధికారులతో విడతల వారీగా చర్చించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌పై నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు.
ఉన్న పరిస్థితుల్లో పక్కదారి పట్టించడమొక్కటే మార్గమన్న సలహాల మేరకు కొత్త వ్యూహానికి పదునుపెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి చెందిన నేతలకు భద్రత లేదన్న ఆరోపణలకు పదునుపెట్టడంతోపాటు హైడ్రామా నడిపించారు. అసలు కేసును పక్కదారి పట్టించేలా హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణ లేదనీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులను హైదరాబాద్‌లో పెట్టడం ద్వారా భద్రతను తామే పర్యవేక్షిస్తామంటూ కొత్త వాదన తెరమీదకు తెచ్చి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును, డీజీపీ జేవీ రాముడును గవర్నర్ వద్దకు పంపించారు. దాంతోపాటు కేసులకు కేసుతోనే సమాధానమంటూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. సీఎంతో సమావేశం అనంతరం మంత్రులు వరుస పరంపరగా మీడియాతో మాట్లాడుతూ యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందనీ, ఏపీలో కేసీఆర్‌పై నమోదైన కేసులపై సిట్‌ను ఏర్పాటు చేశామని, కేసీఆర్‌కు నోటీసులిస్తామంటూ రకరకాల ప్రకటనలు గుప్పిస్తూ రోజంతా హడావిడి చేశారు.
కేసీఆర్‌పై నమోదైన కేసులపై నోటీసులిస్తామన్న లీకుల ద్వారా చంద్రబాబుకు నోటీసులివ్వకుండా ఆగిపోతారన్న భావనతో విపరీతమైన ప్రచారం చేస్తూ మైండ్‌గేమ్ మొదలుపెట్టారు. చంద్రబాబుకు నోటీసులిచ్చే అధికారం లేదని ఒకవైపు చెబుతూనే, నోటీసులిస్తే సంక్షోభం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి ఫోన్‌ట్యాపింగ్ జరిగినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సందర్భంగా అందుకు సంబంధించి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. మరోవైపు పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు నోటీసు ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆయన రోజంతా చంద్రబాబు కార్యాలయంలోనే ఉండిపోయారు.