దొరికిన దొంగ.. బాబు: కేసీఆర్ | chandrababu is a coughten thief, says kcr | Sakshi
Sakshi News home page

దొరికిన దొంగ.. బాబు: కేసీఆర్

Published Thu, Jun 11 2015 5:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

దొరికిన దొంగ.. బాబు: కేసీఆర్ - Sakshi

దొరికిన దొంగ.. బాబు: కేసీఆర్

- ఏపీ సీఎంపై కేసీఆర్ ఫైర్
- దేశంలోనే అత్యంత వరస్ట్ అవినీతిపరుడు
- పీకల్లోతు ఊబిలో ఇరుక్కున్నడు
- ఎమ్మెల్యేల కొనుగోళ్లకు స్వయంగా ఐదు టీడీపీ ముఠాలను రంగంలోకి దించిండు
- వాటిలో రేవంత్ ముఠా పట్టుబడింది
- మేమెవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదు
- ఫిరాయింపుల చట్టం టీడీపీకి వర్తించదా?
- బాబును, టీడీపీ దొంగలను కేంద్రం కాపాడుతుందనుకోనన్న కేసీఆర్
 
సాక్షి, హైదరాబాద్:
‘‘చంద్రబాబు దొరికిన దొంగ. ఆయన దేశంలోనే అత్యంత వరస్ట్ అవినీతిపరుడు. పీకల్లోతు ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబును, ఎమ్మెల్యే కొనుగోళ్లలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ దొంగలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని అనుకోవడం లేదు. ఏపీ సీఎం ప్రయత్నాలు చూసి రాష్ర్ట ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందన్న సందేహంతో చర్యలు తీసుకున్నాం. పార్టీని కాపాడుకున్నాం. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

బుధవారం రాత్రి కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చేసిందంతా చేసి అరిచి, పెడబొబ్బలు పెడుతున్న దొంగలను కేంద్రం కాపాడుతుందని అనుకోవడం లేదని చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. ‘‘చాలా ఉంది బాగోతం. అదంతా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతా.. తెలంగాణ ప్రభుత్వాధినేతగా నాకు వచ్చే సమాచారం నాకు వస్తది.. నేను ఏది చెప్పాలి.. ఏది చెప్పకూడదు వేరే విషయం.. చంద్రబాబు పీకల్లోతుల్లో కూరుకుపోయి ఉన్నడు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని వివరించిన ఆయన.. రేవంత్ వ్యవహారం బయటపడిన తర్వాతే ఫోన్లు ట్యాప్ అయిన విషయం బాబుకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు పెద్ద గొంతుతో అరిస్తే అయిపోదు. ఫిరాయింపులు మీకు వర్తించవా? ఎస్పీవెరైడ్డి ఏ పార్టీలో గెలిచాడు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు. కొత్తపల్లి గీత ఏ పార్టీ.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోలేదా?

నువ్వు చేర్చుకుంటే నీతి.. ఇతరులది కాదా? వీరంతా టీడీఎల్పీ సమావేశాలకు హాజరు కావడం లేదా? నీతివంతునివే అయితే, ముందు వీటికి సమాధానం చెప్పు’ అని సీఎం నిలదీశారు. నామినేషన్ల దాఖలు నాటికే మూడు పార్టీలను సంప్రదించి తమకున్న సంఖ్యను బట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగామన్నారు. అయితే చంద్రబాబుకు ఉన్నది 16 ఓట్లే అయినా ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది ఎవరు.. ఎన్నికల్లో చివరకు ఏం జరిగింది.. నోట్ల కట్టతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తర్వాతే ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొచ్చిందా’’ అని ప్రశ్నించారు.

టేపుల్లో ఉన్నది ఆయన గొంతు కాదా?
‘చంద్రబాబు పలువురు నేతలతో మాట్లాడారా లేదా? స్టీఫెన్‌సన్‌కు రేవంత్ డబ్బిచ్చాడా లేదా? చంద్రబాబు కూడా స్టీఫెన్‌తో మాట్లాడాడా.. లేదా? ఏసీబీకి స్టీఫెన్‌సన్ ఫిర్యాదు చేశాకే కదా.. ఏసీబీ రంగంలోకి దిగింది. ట్యాపింగ్ చేశారంటాడు.. కట్ అండ్ పేస్ట్ అంటాడు.. అది బాబు గొంతేనా కాదా?’ అని సీఎం కే సీఆర్ నిలదీశారు. చట్టం తనపని చేస్తుందన్న కేసీఆర్.. చంద్రబాబును దొరికిన దొంగ అని అభివర్ణించారు.

‘‘రాజకీయాలను మలినం చేశారు. ఏపీలో చంద్రబాబు బీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిండేమో కానీ, ఇక్కడ తెలంగాణ ప్రజల దీవేనతో అధికారంలోకి వచ్చాం. మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్పే అధికారం చంద్రబాబుకు ఎక్కడిది? ఏపీలో నువ్వు బీజేపీ మద్దతుతో గెలిచావ్. ఇక్కడ మేం ప్రజాస్వామయ్య బద్దంగా గెలిచాం. నువ్వు కాదు, నీ జేజెమ్మ కూడా ఏం చేయలేదు. మా వెంట్రుక కూడా పీకలేరు’’ అని కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీకి నేనేందుకు వెళ్తున్న..నాకేం ఖర్మ.. ఈ కేసుల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి నాకెవరూ ఫోన్ చేయలేదు. చేస్తరని కూడా నేను అనుకోవడం లేదు. ఇలాంటి ముడుపుల కేసులకు ప్రధాని మోదీ మద్దతిస్తారని నేన నుకోను’ అని ఆయన అన్నారు.

‘‘ఎమ్మెల్యే ఓట్లనే రూ. 5 కోట్లకు కొనుగోలు చేయడం ఎంత నీచమైన విషయం. చేసిన తప్పును కప్పి పుచ్చుకోడానికి ఇంత గతి ఎందుకయ్యా.. సమస్య నీది.. నీ సమస్యను ఇరు రాష్ర్ట ప్రజల సమస్యగా ఎందుకు మార్చుతున్నారని లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ ఇప్పటికే అన్నడు. ఆంధ్ర ప్రజలు ఆంధ్రలో.. తెలంగాణ ప్రజలు తెలంగాణలో సంతోషంగా ఉన్నరు. వాళ్లకు నీ మసిని ఎందుకు పూస్తున్నవయ్యా.. కుమ్మక్కులకు, కుంభకోణాలకు పెట్టిన పేరు చంద్రబాబు.

నేను ఓ పోరాటయోధుడిని.. ఎవరో పెట్టిన పార్టీని గుంజుకుని సీఎంను కాలె. నేను ఓ పార్టీ వ్యవస్థాపకుడిని.. నేను దేనికోసమైతే పోరాడానో దాన్ని పొందాను. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నా’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దగ్గర శిక్షణ తీసుకుంటే తాను కూడా జైలుకు వెళ్లే వాడినన్నారు.

అన్నీ బయటకు వస్తాయి..
‘‘పైసలెక్కడి నుంచి వచ్చినయి..ఎవరెవరితో మాట్లాడారు.. అవన్నీ బయటకువస్తయి. స్టీఫెన్‌సన్‌ను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. స్వతంత్ర ఎమ్మెల్యే అయితే పైసలు పెట్టి కొంటవా? వాళ్లు(టీడీపీ నేతలు) చాలా ప్రయత్నం చేశారు. తొలుత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నరు. నాకు సమాచారం వచ్చింది. ఓరే సన్నాసి.. మీ కథ అయిపోయిందని నేను అలర్ట్ చేసిన. వాళ్లు ఎమ్మెల్యేల కాళ్లు చేతులు పట్టుకుని క్యాంపునకు తీసుకెళ్లారు.

వైఎస్సార్‌సీపీ మాకు మద్దతివ్వాలని డిసైడ్ అయింది. సీపీఐ, సీపీఎం వాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలను బెదిరించడం, భయపెట్టడం మీకు చేతకాదని.. చంద్రబాబే రంగంలోకే దిగాడు. ఐదు ముఠాలను ఏర్పాటు చేశాడు.. అందులో ఓ ముఠా పట్టుబడింది. మిగిలిన ముఠాలు బొక్కలో ముడుచుకుపోయాయి’’ అని సీఎం కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
హైదరాబాద్‌లో అతిథివి మాత్రమే..
‘‘నువ్వు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నువ్వు తెలంగాణలో ఏమీ(నో బడీ) కాదు. మాట్లాడితే ఉమ్మడి రాజధాని అంటావ్. ఇది కేవలం మీకు సదుపాయాలు కల్పించేందుకు ఉన్న రాజధాని మాత్రమే. పదేళ్ల వరకు.. పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. నువ్వు తెలంగాణలో కేవలం అతిథి ముఖ్యమంత్రి.

ఏపీలో కార్యాలయాలు లేవు కాబట్టి.. అక్కడ కట్టుకునే వరకు మాత్రమే ఇక్కడ ఉండటానికి అవకాశమిచ్చాం. ఇది నీ హక్కు కాదు. నీ పరిపాలన పరిధిలోకి హైదరాబాద్‌రాదు. తెలంగాణ ముఖ్యమంత్రి పరిధిలోకి వస్తుంది. ఏపీ డీజీపీ ఏపీ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. కేవలం సదుపాయాలు కల్పించేందుకే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తే దాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణను శాసిస్తావనుకుంటావా?’’ అని చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement