గంటా గైర్హాజరీలో జరుగుతున్న టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
జిల్లా పశుగణాభివృద్ధి కమిటీ అధ్యక్ష ఎన్నిక, ఒక పత్రికలో సర్వే పేరుతో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాల నేపథ్యంలో అలక పాన్పు ఎక్కిన మంత్రి గంటా తెలుగుదేశం పార్టీకి మాత్రం అంటీముట్టనట్లే ఉంటున్నారు..ఆ రెండు ఘటనల విషయంలో ఉప ముఖ్యమంత్రి, సీఎంల బుజ్జగింపులతో మంత్రి అలకపాన్పు దిగినట్లు కనిపించినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అంతగా పాల్గొనడం లేదు..నగరంలో గురువారం జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి నగరంలోనే ఉన్నా.. గంటా డుమ్మా కొట్టడం.. ఆయన గైర్హాజరుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనంతో వ్యంగ్య బాణాలు విసరడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకమైన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. గత రెండు నెలలుగా ఆయన పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కార్యక్రమాలకు ఇవ్వడం లేదన్న వాదన పార్టీలో బలంగా విన్పిస్తోంది. మంత్రులు పాల్గొనే కీలక అధికారిక సమీక్ష సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు.
కీలక సమావేశానికి సైతం..
తాజాగా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప అధ్యక్షతన గురువారం జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి గంటా గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు పార్టీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి గంటా కోసం ఉదయం 9 నుంచి గంటన్నర పాటు వేచి చూశారు. కానీ ఆయన వచ్చే సూచనలు కన్పించకపోవడంతో 10.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. కీలకమైన ఈ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం పట్ల సహచర మంత్రుల్ది్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోనీ స్థానికంగా లేరా అంటే.. గంటా జిల్లాలోనే ఉన్నారు. భీమిలిలో తన అనుచరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని తెలుసుకున్న ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప పుట్టినరోజు వేడుకలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఇవ్వకపోవడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప
‘మంత్రి గారికి ఏం పనులున్నాయో.. ఏమో ? అని చినరాజప్ప మంత్రి గంటానుద్దేశించి ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గంటా విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రిలిరువురూ తీవ్ర అసహనంతోనే బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గంటా కూడా సమాచారం ఇచ్చాం. ఆయన రాకపోతే ఏం చేస్తాం అని చినరాజప్ప వ్యాఖ్యానించారు.
ఈ మీటింగ్‌తో పనేముంది?..ఆయన కోసం ఏం చెబుతాం:అయ్యన్న
మంత్రి గారికి బోల్డన్ని పనులు.. ఈ మీటింగ్‌తో పని ఏముంది అంటూ మరోమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యం గ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తీరు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీ సమావేశాన్ని కాదని పుట్టిన రోజు వేడుకల్లో గంటా పాల్గొన్నారట..మీ దృష్టికి రాలేదా? అంటూ విలేకర్లు మరోసారి గుచ్చిగుచ్చి ప్రశ్నించగా ఆయన కోసం ఏం చెబుతాం? అంటూ బదులివ్వడానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అలక వీడలేదా?
డీఎల్‌డీఏ వివాదంతో అలకపాన్పు ఎక్కిన గంటా ఇంకా పాన్ను దిగలేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మంత్రి అయ్యన్న కోసం డీఎల్‌డీఏ పదవిని తన అనుచరుడు గాడు వెంకటప్పడుకు దక్కనీయకుండా హోంమంత్రి చినరాజప్ప కలెక్టర్‌పై ఒత్తిడి తేవడం పట్ల గంటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చివరికి అదే చినరాజప్ప జోక్యంతో గంటా అనుచరుడే ఆ పదవి చేపట్టడంతో ఆ వివాదానికి తెరపడింది. కాగా ఓ పత్రికలో తనకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేను సాకుగా చూపి గంటా కేబినెట్‌కు సైతం డుమ్మా కొట్టి గత నెలలో మరోసారి అలక బూనడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జూన్‌లో జరిగిన పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం పర్యటనలో మంత్రి పాల్గొంటారో లేదోనన్న పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే మళ్లీ ఇన్‌చార్జి మంత్రి చినరాజప్పే గంటా ఇంటికి వెళ్లి బుజ్జగించి తన వెంట తీసుకెళ్లి సీఎం పక్కనే కూర్చొబెట్టారు. సీఎం కూడా బుజ్జగించడంతో ఆయన కాస్త మెత్తబడినట్టు కనిపించారు. కానీ పార్టీ కార్యక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదని.. మరీ ముఖ్యంగా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప పాల్గొన్న కార్యక్రమాలకు గంటా డుమ్మా కొడుతుండడం టీడీపీలోనే చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment