మెదక్ సభలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
సాక్షి, పాపన్నపేట(మెదక్): కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే భారీ మెజార్టీతో పద్మక్కను గెలిపించినందున ఈసారి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం, గోదావరి నీళ్లను సింగూరుకు.. అక్కడి నుంచి ఘనపురం ప్రాజెక్ట్‌కు ఇవ్వడం ద్వారా మెతుకుసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మెతుకుసీమకు గోదావరి నీళ్లు రావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటెయ్యాలన్నారు. 16మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామన్నారు. ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. మెదక్ పట్టణానికి రైల్వేలైన్ తీసుకురావడంలో కృషి చేశానని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాపన్నపేట మండలం మొదటినుంచీ మెదక్ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తోందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు భారీ విజయం చేకూర్చినట్లుగానే ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సైతం ఎక్కువ మెజార్టీలో అందించాలన్నారు. పాపన్నపేట మండల కేంద్రాన్ని తాను దత్తత తీసుకున్నానని, ఈమేరకు ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
భారీ ర్యాలీ..
పాపన్నపేటలో టీఆర్‌ఎస్ ప్రచార సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు తమ కులవృత్తులను సూచించే పరికరాలతో ర్యాలీ కొనసాగించారు. మండల కార్యాలయం నుంచి స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో సోములు, సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, అనురాధ, లింగారెడ్డి, జగన్, శ్రీనాథ్, బాపురెడ్డి, గోపాల్‌రెడ్డి, రవి, నవీన్, ఎంపీపీ సొంగ పవిత్ర దుర్గయ్య, జెడ్పీటీసీ సాతెల్లి స్వప్నా బాలగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గౌస్, ఇమానియల్, బాబర్, బాపురావు, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment