సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. ప్రతి మహిళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం అయ్యేదిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాల పట్ల మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు.
అదేంటన్నా.. మొత్తం మహిళలకేనా!
ఈ సందర్భంగా ఇటీవల కేబినెట్ సమావేశంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన సంభాషణను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గుర్తుచేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘మొన్నటి కేబినెట్ భేటీలో అదేంటన్నా మొత్తం మహిళలకే అంటున్నారని ఒకరంటే.. ఎవరేమనుకున్నా.. మన ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు. ‘వామ్మో ఆడపిల్లా.. అనుకునే పరిస్థితి నుంచి.. మాకు లక్ష్మీదేవి ఆడపిల్ల పుట్టిందా అనుకునేవిధంగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అంటూ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు మహిళలందరికీ డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, మీ బంగారం మీ ఇంటికి వస్తుందని ప్రగల్బాలు పలికారని, కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మహిళలను పట్టించుకోకుండా వారిని కోర్టుల చుట్టు తిప్పిన ఘనత చంద్రబాబుదన్నారు. సున్నా వడ్డీ రుణాల కోసం చెల్లించాల్సిన నిధులు కూడా చంద్రబాబు సక్రమంగా చెల్లించలేదని, ఎన్నికలముందు బెల్టు షాపులు రద్దుచేస్తానని చంద్రబాబు చెప్పారని, కానీ, ఆయన అధికారం ముగిసేనాటికి 40వేల బెల్టు షాపులు ఏర్పడి.. మహిళల జీవితాల్ని నాశనం చేశాయని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మహిళలను రాజకీయంగా అగ్రవర్ణం మహిళలను ఎదుర్కోవడానికే ఉపయోగించిందన్నారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసి గాయపరిస్తే.. ఆ ఎమ్మెల్యే తీరును ఖండించాల్సిపోయి.. వనజాక్షినే చంద్రబాబు తప్పుబట్టారని గుర్తు చేశారు. ఇటీవలి ఎన్నికలకు ముందు మహిళలను మళ్లీ మోసం చేయాలనే దుర్బుద్ధితో మళ్లీ పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు డ్రామాలాడారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇసుకు ర్యాంపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం మభ్యపెట్టినా.. అవి వారికి లబ్ధి చేకూర్చలేదని తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వం మహిళలను అనునిత్యం మోసం చేసే దిశగా పరిపాలన సాగిస్తే.. మహిళలను గౌరవించే దిశగా, మహిళల అభ్యున్నతి దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాదయాత్రలో ప్రతి ఆడబిడ్డ కష్టాన్ని తెలుసుకొని.. మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. దళితులుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అంటే.. ఏకంగా దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దని ప్రశంసించారు. ఎస్టీలకు హక్కులను కాలరాసే విధంగా గత ప్రభుత్వం పాలన సాగించగా.. ఒక ఎస్టీ మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉన్నత స్థాయిలో ఉంచిన గొప్పతనం వైఎస్ జగన్‌ది అన్నారు. ప్రతి పేద తల్లికీ ఒక సోదరుడిలా అండగా ఉంటూ అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారని, అదేవిధంగా గ్రామ వాలంటీర్లలోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద రూ. 75వేల రూపాయలు రానున్న నాలుగేళ్లలో అందించనున్నారని పేర్కొన్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకొనే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. అన్ని రంగాల్లోనూ వారు ముందుకు రావాలంటూ వైఎస్ జగన్ తీకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్ చెప్తున్నానని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.
అసెంబ్లీ రేపటికి వాయిదా..
సభలో సభ్యుల ప్రసంగాల అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment