
సాక్షి బెంగళూరు: ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజ్యసభకు పోటీ చేయనని జేడీఎస్ జాతీయాధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వెల్లడించారు. జూన్‌లో రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఒక స్థానానికి కాంగ్రెస్ సహాయంతో దేవెగౌడ పోటీ చేస్తారని ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో వాటన్నింటికి ఆయన స్పష్టత నిచ్చారు. శనివారం జేపీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తాను రాజ్యసభకు వెళ్లనని తెలిపారు. తాను రైతుల కోసం పోరాడేందుకు రాజ్యసభకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎక్కడున్నా రైతుల తరపున పోరాటం చేస్తానని తెలిపారు.
చదవండి: మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం
తన జీవితమే ఒక పోరాటం అని, తనకు అధికార దాహం లేదని వెల్లడించారు. అంతకుముందు దాసరహళ్లిలో జరిగిన సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో దేవెగౌడ పాల్గొని మాట్లాడారు. తాను ఎన్నికల్లో ఓడిపోయాయని, ఇక ఇంటికే పరిమితం అవుతానని ఎవరూ భావించొద్దని తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తన పోరాటం ఎప్పటికి ఆగదని స్పష్టం చేశారు. ఇటీవలే కేరళలో చికిత్స తీసుకుని వచ్చానని, నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు, కానీ ప్రస్తుతం వ్యవస్థకు విరుద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.