సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు కౌంట్‌డౌన్ మొదలవడంతో అసెంబ్లీ సాక్షిగా వెలువడే ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యడ్యూరప్ప సర్కార్ శనివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో బలం నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీఎస్‌తో పొత్తున్న బీఎస్‌పీ నుంచి ఓ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్‌పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తారని చెబుతుండటంతో కూటమి బలం 118కి పెరిగింది. ఇది సాధారణ మెజారిటీ అయిన 111 కంటే అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం 222 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభా కార్యకలాపాలు చేపడుతున్నందున సభ్యుల సంఖ్య 221కు తగ్గుతుంది.
ఇక ఇరు పక్షాల బలం సమానమైతే తప్ప ప్రొటెం స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఇక 104 మంది ఎమ్మెల్యేల మద్దతున్న యడ్యూరప్ప బలనిరూపణలో గట్టెక్కాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఓటింగ్‌కు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటే మేజిక్ మార్క్ మరింత దిగివస్తుంది.
మరోవైపు యడ్యూరప్ప బలనిరూపణ ముగిసేవరకూ ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిని నామినేట్ చేయరాదని, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాలు స్పష్టమైన మెజారిటీ తమకే ఉందంటూ తెరచాటు మంత్రాంగాలు నెరుపుతున్న క్రమంలో కన్నడ సభలో బలనిరూపణపై సర్వత్రా ఉత్కఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment