సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై ప్రముఖ నటుడు విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ‘నిన్న ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విశాల్ నామినేషన్‌ను మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారు? నాపట్ల ఈసీ వ్యవహరించిన తీరును చూసి షాక్ తిన్నాను’ అని విశాల్ బుధవారం మీడియాతో పేర్కొన్నారు. తన నామినేషన్‌ను బలపరుస్తూ సంతకాలు చేసిన వారిని బెదిరించారని విశాల్ ఆరోపించారు. ఉద్దేశపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించారని అన్నారు. నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, నాయ్యం జరిగేవరకు వదిలిపెట్టబోనని విశాల్ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి విశాల్ లేఖ..!
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సంబంధించిన తన నామినేషన్‌ను తిరస్కరించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నటుడు విశాల్ లేఖ రాశారు. తన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడం సరికాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. తన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని లేఖలో తెలిపారు
ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది.
Comments
Please login to add a commentAdd a comment