
హర్దనహళ్ళి దొడ్డెగౌడ కుమారస్వామి.... అభిమానులు, జేడీ(ఎస్) కార్యకర్తలు అభిమానంగా పిలుచుకునే కుమారన్న... సిద్దరామయ్యకు కంటిలో నలుసుగా మారబోతున్నారా? కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే కాంగ్రెస్ ఆశలకు గండికొట్టబోతున్నారా? కుమారస్వామి బహిరంగ సభలకు భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల్ని చూస్తుంటే కర్ణాటక ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయని అనిపిస్తోంది.
రెండు నెలల క్రితం వరకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ... జేడీ(ఎస్) ని పెద్దగా లెక్కలోకి వేసుకోలేదు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కుమారస్వామి బహిరంగ సభలకు, ర్యాలీలకు ప్రజలు భారీసంఖ్యలో హాజరవుతున్నారు. వాస్తవానికి రాహుల్‌గాంధీ, అమిత్‌షాల మీటింగ్‌ల కన్నా ఎక్కువ సంఖ్యలోనే. కుమారస్వామి వెంట చెప్పుకోదగ్గ పేరున్న నాయకులు లేరు. అలాగే కాంగ్రెస్, బీజేపీలకున్న హంగూ ఆర్బాటం కూడా లేదు. కాని భారీగా హాజరవుతున్న ప్రజలు కుమారస్వామిలో, జేడీ(ఎస్) నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలలాగే జేడి(ఎస్)కి కూడా అత్యంత కీలకమైనవి. 2006లో కాంగ్రెస్ – జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకల నేపధ్యంలో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన కుమారస్వామి 20 నెలలపాటు అధికారాన్ని చెలాయించారు. కర్ణాటక చరిత్రలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 2008 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక కర్ణాటకలో పునర్‌వైభవం కోసం జేడీ(ఎస్), కుమారస్వామి తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఈ సారి గెలవకపోతే కర్ణాటకలో జేడీ(ఎస్) ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయం కుమారస్వామిలో ఉంది. పాత మైసూరు ప్రాంతంలో జేడీ(ఎస్)కి మంచిపట్టు ఉంది. కనీసం 75 అసెంబ్లీ సీట్లలో జేడీ(ఎస్) కాంగ్రెస్‌కి గట్టిపోటీ ఇస్తోంది. మైసూర్, హాసన్, మాండ్య, తుమకూరు జిల్లాలతో పాటు బెంగళూరు శివారు ప్రాంతాల్లో జేడీ(ఎస్) ప్రభావం గట్టిగానే కనపడుతోంది. అనూహ్యంగా బలం పుంజుకుంటున్న జేడీ(ఎస్) కాంగ్రెస్‌ని కొంత కలవరానికి గురిచేస్తోంది.
ఆరు నెలలక్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న కుమారస్వామి తొందరగానే కోలుకున్నారు. అనారోగ్య ఛాయలేమి కనపడకుండా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారీ సంఖ్యలో హాజరవుతున్న ప్రజల ఓట్లను రాబట్టుకోగలిగితే ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి ‘కింగ్ మేకర్’ అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ కాని, బీజేపీ గానీ స్వంతంగా అధికారాన్ని చేజిక్కుంచుకోగలిగితే జేడీ(ఎస్) ఉనికి ప్రశార్థకమవుతుంది. ఈ నేపధ్యంలోనే ‘హంగ్ అసెంబ్లీ’ వస్తే కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనేది జేడీ(ఎస్) ఆశ.
జేడీ(ఎస్)ని బీజేపీ ‘బీటీమ్’ గా సిద్దరామయ్య ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ మాత్రం జేడీ(ఎస్) వీలైనన్ని కాంగ్రెస్ సీట్లను తగ్గించగలిగితే కర్ణాటకలో గెలవొచ్చనే వ్యూహంలో ఉంది. ఎవరికో ‘బీటీమ్’ గా ఉండాలని కాదు... ఎన్నికల్లో మేమే గెలవబోతున్నామని కుమారస్వామి బహిరంగ సభల్లో చెబుతున్నారు. సిద్దరామయ్య, యెడ్యూరప్పల కన్నా తన పాపులారిటీ ఎక్కువని కుమారస్వామి నమ్మకం. ఇక కాంగ్రెస్ పార్టీ తన దాడిని ఎక్కువగా బీజేపీపైనే కేంద్రీకరించాలని ఆ పార్టీ నాయకుల ఆలోచన. కుమారస్వామిపై దాడి ఉదృతం చేస్తే అది జేడీ(ఎస్)కే మేలు చే స్తుందని వారి భయం. ఎవరి వ్యూహాలు వారివి. కర్ణాటక ప్రజలు మే 12 ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే...
– ఎస్ గోపీనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment