బిహార్ మాజీ సీఎం మాంఝీతో ఆర్జేడీ నాయకులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్
పట్నా : హిందుస్తాన్ ఆవామ్ మోర్చా(సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ బీజేపీ కూటమి నుంచి వైదొలిగారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిలో ఆయన చేరబోతున్నారు. బిహాన్ ప్రతిపక్షనేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ బుధవారం ఉదయం పట్నాలోని మాంఝీ నివాసానికి వచ్చి కాసేపు మంతనాలు జరిపారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలోకి మాంఝీ చేరికపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఉప ఎన్నికలో పోటీ కోసమే! : నాడు సీఎం పదవిని కాపాడుకునేందుకు సొంత పార్టీ జేడీయూను ధిక్కరించి బీజేపీతో జతకట్టిన మాంఝీ.. తర్వాతి కాలంలో సొంతగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో దెబ్బతిన్నారు. రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో.. తన కుమారుడు ప్రవీణ్ మాంఝీని నాయకుడిగా నిలబెట్టాలని జీతన్ రామ్ భావిస్తున్నారు. జెహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీఏ తరఫున తన కుమారుడిని బరిలోకి దించాలని ప్రయత్నించారు. కానీ ఆ స్థానంలో జేడీయూ తన అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో మనస్తాపం చెందిన మాంఝీ.. ఏకంగా ఎన్డీఏ నుంచి బయటికొచ్చేశారు. మాఝీ దూత ఒకరు ఇటీవలే రాంచీ జైలులో ఉన్న లాలూలును కలుసుకున్నారని, జెహానాబాద్ టికెట్‌పై హామీ లభించిన పిదపే కూటమిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
మహాకూటమిలోకి మాంఝీ రాకను స్వాగతిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రకటనలిచ్చాయి. ‘ఆయన మాకు సంరక్షకుడిలాంటివారు. కూటమి వారిని సముచిత గౌరవిస్తుంది’ అని తేజస్వీ పేర్కొనగా, ‘ఆలస్యమైనా మాంఝీ మంచి నిర్ణయం తీసుకున్నార’ని బిహార్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అధ్యక్షుడు కౌషబ్ ఖాద్రీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment