
సాక్షి, విజయవాడ : జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న పార్థసారధిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైఎస్‌ఆర్ సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఆయన మంగళవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జన్మభూమి సభను నడిపిస్తున్నారని అన్నారు. తమ పార్టీ నేత పార్థసారధితో పాటు, కోలవెన్ను గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న జన్మభూమి...టీడీపీ కార్యక్రమంలా తయారైందని జోగి రమేష్ విమర్శించారు. జన్మభూమిలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాలు జన్మభూమికి రాకూడదా? ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాకూడదా అంటూ... ఏం నేరం చేశారని పార్థసారధిని అరెస్ట్ చేశారని ప్రశ్నలు సంధించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి గడపకు రేషన్ కార్డులు ఇచ్చారన్నారు. విపక్ష నేతలకు మాట్లాడే అవకాశం ఉండేదని అన్నారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ దుకాణాల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారని, చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప ఏమీ రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణాలను మాఫీ చేశామని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతున్నారని, రుణమాఫీతో పాటు డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేసిన ఘనత ఆయనదేనని జోగి రమేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ నడిబొడ్డున చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నియోజకవర్గాల్లో ఏ మేరకు నెరవేర్చారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.