వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనం జరుగుతోందని, ఆయన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టకు రావడాన్ని ప్రకృతి కూడా సహించలేకపోయిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఓ పక్క హుదూద్.. మరోవైపు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు ఒంటిమిట్టలో అదే జరిగిందంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలో జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన పాపాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మనుషులే కాదు ప్రకృతి కూడా ఆయనపై కోపంగా ఉందన్నారు. కన్నులపండువలా ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణం జరుగుతుంటే చంద్రబాబు వచ్చారని ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదని, దాంతో నలుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో గోదావరి పుష్కరాల్లో వీడియో పేరుతో 30 మంది భక్తులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రకృతి విలయతాండవం చేస్తుందని, చంద్రబాబు చేసిన పాపాలే అందుకు కారణమంటూ ఎద్దేవా చేశారు. ఆయనలో ఉన్న భయాన్ని ప్రజలపై రుద్దే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని, నీతివంతంగా ఉన్నంతవరకూ ఎవరో ఏదో చేస్తారని భయాలెందుకు ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా ప్యాకేజీ రాగం అందుకున్న చంద్రబాబు వైఎస్ఆర్‌సీపీ పోరాటాలతో, ఎన్నికల భయంతో హోదా కోసం పోరాడామంటూ కొత్తరాగం అందుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తన అవసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అడుగులో అడుగు వేసుందుకు రాష్ట్రంలో ఎవరూ సిద్ధంగాలేరని, 'నువ్వు అవినీతి పరుడివి, దొంగవి, మోసకాడివని' ఏపీ సీఎంతో తిరిగిన వాళ్లే చెప్పారని వివరించారు.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదని, ఏపీ రైతులకు, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని తెలిపారు. ఇంకా రైతులు రుణాల సమస్యలతో బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, అసమర్ధ సీఎం ఉన్నంతవరకూ ఏ వర్గానికి న్యాయం జరగదంటూ చంద్రబాబుపై జోగి రమేష్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment