సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ. సంపత్‌కుమార్‌ల బహిష్కరణ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కోర్టు ధిక్కార ఆరోపణలపై శుక్రవారం విచారణకు హాజరైన న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులను హైకోర్టు.. రిజిస్ట్రార్ (జ్యుడీషి యల్) కస్టడీకి అప్పగించింది. తదుపరి విచారణకు హాజరవుతామన్న లిఖితపూర్వక హామీతోపాటు రూ. 10వేల వ్యక్తిగత పూచీకత్తులపై వారిని కస్టడీ నుంచి విడుదల చేసింది. కార్యదర్శుల స్థాయి అధికారులను ఇలా కస్టడీలోకి తీసుకోవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ కేసులో అప్పటి స్పీకర్ మధుసూదనాచారిని 6వ ప్రతివాదిగా చేర్చింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణను రద్దు చేస్తూ తాము తీర్పిచ్చినా వారి సభ్యత్వాలను ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని మధుసూదనాచారిని ఆదేశించింది. అలాగే కోమటిరెడ్డి, సంపత్‌లకు గన్‌మెన్లను పునరుద్ధరించాలన్న ఆదేశాలను బేఖాతరు చేసినందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా ఎస్పీ ఆవుల వెంకట రంగనాథన్, అప్పటి జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిలకు కోర్టు ధిక్కారం చట్టం ఫారం–1 నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు ఆదేశాలిచ్చారు. గత విచారణ సమయంలో తనపట్ల ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ నోరుపారేసుకున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు తీరును న్యాయమూర్తి ఆక్షేపించారు. చేసిన తప్పుకు ఏఏజీ కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారని భావించానని, అయితే ఆయనలో ఏ పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. సరైన సమయంలో రామచంద్రరావుపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ మొత్తం వ్యవహారాన్ని సుప్రీంకోర్టుకు నివేదిస్తానన్నారు. కోర్టు ధిక్కార చట్టం కింద కోర్టు ముందు హాజరు కావాల్సిన వారంతా హాజరైతే ఆ తరువాత సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించి కేసును మూసివేయాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తానన్నారు. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేశారు. మధుసూదనాచారితోపాటు డీజీపీ, ఇద్దరు ఎస్పీలు మార్చి 8న వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని భావిస్తున్నానని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కోర్టు తీర్పు అమలు చేయరా...?
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ గత అసెంబ్లీ తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు గతేడాది తీర్పిచ్చారు. వారి శానససభ్యత్వాలను పునరుద్ధరించాలని, గన్‌మెన్ సౌకర్యాన్ని కూడా పునరుద్ధరించాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును అమలు చేయకపోవడంతో అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులతోపాటు డీజీపీ, ఇద్దరు ఎస్పీలపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గత శుక్రవారం విచారణకు రాగా నిరంజన్‌రావు, నరసింహాచార్యులు కోర్టు ముందు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి... వారిద్దరికీ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. వారిని తమ ముందు హాజరుపరచాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా నిరంజన్‌రావు, నరసింహాచార్యులు కోర్టు ముందు హాజరవడంతో వారిని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కస్టడీకి అప్పగించి ఆ తర్వాత బాండ్లపై విడుదలకు ఆదేశించారు.
కేంద్ర హోంశాఖను ఆదేశిస్తాం...
ఈ కేసులో అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి జారీ చేసిన నోటీసును తిరస్కరించడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. ఇలాగే కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోని అప్పటి మణిపూర్ స్పీకర్ డాక్టర్ హెచ్. బోరోబాబుసింగ్‌ను తమ ముందు హాజరుపరచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర హోంశాఖను ఆదేశించిందని గుర్తుచేశారు. స్పీకర్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకాకపోతే ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని తెలిపారు. డీజీపీ విషయంలోనూ ఇలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు.
మధుసూదనాచారిది కోర్టు ధిక్కారమే...
కోర్టు నోటీసును తిరస్కరించడం, సభ్యత్వాల పునరుద్ధరణలో కోర్టు తీర్పును అమలు చేయకపోవడం ద్వారా అప్పటి స్పీకర్‌గా మధుసూదనాచారి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని న్యాయమూర్తి అన్నారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. కోర్టు ఆయనకు నోటీసు జారీ చేసిందని, అందువల్ల కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయలేదో వివరించాలని మధుసూదనాచారిని ఆదేశించారు. కోర్టు ధిక్కారం కింద ఎందుకు శిక్షించరాదో వివరణ ఇవ్వాలన్నారు. అందులో భాగంగా ఆయనను ఈ ధిక్కార వ్యాజ్యంలో 6వ ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపారు. డీజీపీ, ఇద్దరు ఎస్పీలు సైతం నోటీసులకు స్పందించనందున వారికి ఫారం–1 నోటీసు ఇస్తున్నట్లు తెలిపారు. గత విచారణ సమయంలో నోరుపారేసుకున్న అదనపు ఏజీ జె.రామచంద్రరావుకు నోటీసు జారీ చేసేందుకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు. అదనపు ఏజీతో తాను ఈ అంశంపై చర్చిస్తానని, అప్పటివకు నోటీసు జారీని వాయిదా వేయాలని నరసింహాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణ కోరగా జడ్జి అంగీకరించారు. గత విచారణప్పుడు ఉత్తర్వుల్లో పేర్కొన్న సంవత్సరాన్ని తాను తప్పుగా చెప్పడంపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ శరత్ ఎగతాళి చేశారని, అయినా తాను ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment