
కె. పార్థసారధి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ-బీజేపీ చేసిన అన్యాయంపై ప్రజలు భగ్గుమంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు కె. పార్థసారధి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కులమతాలకు అతీతంగా ప్రజలంతా రోడెక్కితే సీఎం చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, కేసులకు భయపడి కేంద్రానికి దాసోహమయ్యారని ఆరోపించారు. తన స్వార్థంకోసం రాజీపడ్డారని అన్నారు. టీడీపీ ఎంపీలు కనీస విచక్షణ కూడా లేకుండా పార్లమెంట్‌లో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ డ్రామాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు వెల్లడించాలని పార్థసారధి డిమాండ్ చేశారు.
కాగా, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు బంద్ నిర్వహించాయి. ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.