
సాక్షి, అమరావతి: ప్రజల డేటాను తస్కరించిన స్కాంలో ఏ–1 సీఎం చంద్రబాబు, ఏ–2గా మంత్రి లోకేష్‌ను చేర్చి విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ నేత, కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార స్కాంపై జరుగుతున్న పరిణామాలు చూసి రాష్ట్రం నివ్వెరపోతుందని, ప్రభుత్వ పరిధిలో గోప్యంగా ఉండాల్సిన డేటాను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ఆ డేటాను ఐటీ సంస్థలకు అప్పగించారని దుయ్యబట్టారు. (ఇదీ జరుగుతోంది!)
ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ సంస్థల సైబర్ క్రైంపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పై రెండు సంస్థలు ప్రభుత్వానికి సర్వీస్ ప్రొవైడర్లు అని ఉన్నతాధికారులు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభిస్తే, చంద్రబాబుకు ఉలుకెందుకని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం వద్ద డేటా అంతా భద్రంగానే ఉందని, చోరీకి గురి కాలేదని అధికారులు అంటున్నారని, మరి ఓటర్ల జాబితాలో కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల ఫొటోలు ఐటీ కంపెనీల దగ్గర ఎలా బయటకొచ్చాయని ప్రశ్నించారు. బ్లూ ఫ్రాగ్స్, ఐటీ గ్రిడ్ కంపెనీలకు సాయపడింది.. పెంచి పోషిస్తుంది.. ఎల్లో ఫ్రాగ్స్ అని, అక్రమాల లుకలుకలు బయటపడటంతోనే టీడీపీ అసలు రంగు బయటపడిందన్నారు. చంద్రబాబు ఇటీవలే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడారని, టాంపరింగ్ ఎలా చేయాలో... తెలిపే వ్యక్తి చంద్రబాబు సలహాదారుడిగా పనిచేస్తున్నారని కన్నబాబు చెప్పారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్)
Comments
Please login to add a commentAdd a comment