సిద్దరామయ్య,యోగి ఆదిత్యనాథ్
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనతో సహా పలు అల్లర్ల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న 20 వేల మంది నిందితులకు జైళ్ల నుంచి విముక్తి కల్పిస్తూ గత డిసెంబర్ 22వ తేదీన సవరణ బిల్లును తీసుకొచ్చారు. అందులో గోరక్‌పూర్‌లోని పీపీ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో 188వ సెక్షన్ కింద ఆదిత్యనాథ్‌పై దాఖలైన కీలకమైన కేసు కూడా ఉంది. ఇలా వివిధ అల్లర్ల కేసుల్లో అరెస్టై విచారణ ఎదుర్కొంటున్న వారంతా మెజారిటీ హిందువులే. వారంతా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల్లో అరెస్టైన వారే. వారిని కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ బిల్లు తేవడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ఆదిత్యనాథ్ మతం ప్రాతిపదికన రాజకీయాలు నెరపుతున్నారంటూ విమర్శలు గుప్పించింది.
దాదాపు ఇలాంటి పనినే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య చేశారు. ఆయన ఆదేశాల మేరకు అదే డిసెంబర్ 22వ తేదీన, మళ్లీ జనవరి 2వ తేదీన రాష్ట్ర డీజీపీ 23 జిల్లాల్లోని తన సబార్డినేట్లకు లేఖలు రాశారు. వివిధ అల్లర్ల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అమాయక మైనారిటీల(ఇన్నోసెంట్ మైనారిటీస్)పై కేసులు ఉపసంహరించుకోవడం పట్ల అభిప్రాయాలేమిటో తెలియజేయమని ఆ లేఖల్లో తన కింది అధికారులను డీజీపీ అడిగారు. ఆ తర్వాత ఈ లేఖలను పట్టుకున్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
దీంతో దొరికిపోయామనుకున్నకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్నదే తమ ఉద్దేశమని, ఇన్నోసెంట్ మైనారిటీస్ అని పొరపాటున వచ్చిందని, అది టైపోగ్రాఫికల్ తప్పిదమేనని సమర్థించుకునేందుకు ప్రయత్నించింది. 2013లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక ఇప్పుడు, అంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనారిటీల విడుదలకు ప్రయత్నించడం అంటే ఓట్ల రాజకీయమేనన్నది ఎవరికైనా అర్థం అవుతుంది. ఒకవేళ ‘ఇన్నోసెంట్ పర్సన్స్’ అన్న మాటనే నిజం అనుకుంటే అమాయకులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారన్న అర్థం వస్తుంది. మరి అన్యాయంగా అమాయకులను అరెస్ట్ చేసిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందా? మున్ముందు తీసుకునే ఉద్దేశం ఉందా? సాధారణంగా అల్లర్ల కేసుల్లో సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా కోర్టులు కేసులను కొట్టివేస్తాయితప్పా, పోలీసులు విడుదల చేయరు.
ఆదిత్యనాథ్ ఏకంగా బిల్లునే తీసుకరాగా, సిద్దరామయ్య కూడా ఆ దిశగానే ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ హిందూత్వ పేరిట మత రాజకీయాలను ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగైనా వరుస రాష్ట్ర విజయాలతో ముందుకొస్తున్న బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకొని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా మతం ప్రాతిపదికనే వ్యవహరిస్తోంది. ఇది ఆ పార్టీ సిద్ధాంతానికే కాదు, లౌకిక వ్యవస్థ మనుగడకే ముప్పు తెస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment