సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడిందే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. విపక్షాలు అబద్దాలు చెబుతుంటేనే పాలకపక్షం వివరణ ఇవ్వాల్సిన బాధ్యతతోనే ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్ ఎందుకు చేపట్టారో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి హజరైతే తెలిసేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాం 2007లో ప్రాజెక్టులు ప్రారంభించి తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. నీటి లభ్యత లేని కారణంగానే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మేడిగడ్డకు మారిందని తెలియచేశారు. కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌కు జేజమ్మలుగా మారారంటూ ఎద్దేవా చేశారు. తుమ్మిడి హెట్టి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.
మహారాష్ట్ర తో గోదావరి జలాల పై ఒప్పందం కుదుర్చుకోకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించిన దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని, కానీ పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుని శరవేగంగా గోదావరి పై ప్రాజెక్టులు కడుతున్న ఘనత టీఆర్‌ఎస్‌ది అని ప్రభాకర్ పేర్కొన్నారు. తుమ్మిడి హట్టి, గ్రావిటీ ప్రాజెక్టు అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేకపోతే పీసీపీ చీఫ్ పదవిని వదలుకుంటారా అని సవాల్ విసిరారు. మిడ్ మానేరు ను కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో పూర్తి చేయలేకపోయిందని, కానీ టీఆర్‌ఎస్ సర్కార్ కేవలం 10 నెలల్లో పూర్తి చేశారని తెలియచేశారు. సమైక్య పాలకుల మోచేతి నీళ్లు తాగిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇపుడు అదే ధోరణిలో ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.
ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెరగడం అత్యంత సహజమని కర్నె తెలిపారు. 40 కోట్ల రూపాయలతో మొదలైన శ్రీరామ్ ప్రాజెక్టు అంచనావ్యయం 43 వేల కోట్లకు పెరగలేదా అని ప్రశ్నించారు? ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన సందేహాలకు మంత్రి హరీష్ రావు వెయ్యి సార్లు వివరణ ఇచ్చారని అన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే కాంగ్రెస్ నేతలకు ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. విహార యాత్రలు చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం పై బురద జల్లితే సహించబోమన్నారు. కర్నాటక ఫలితాలు ప్రాంతీయ పార్టీ ల ప్రాముఖ్యతను చాటాయని అభిప్రాయ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment