మళ్లీ రుణమాఫీ.. భారీగా నిరుద్యోగ భృతి! | KCR Released TRS Partial Manifesto | Sakshi
Sakshi News home page

పాక్షిక మేనిఫెస్టోలో కేసీఆర్‌ వరాల వర్షం

Published Wed, Oct 17 2018 2:24 AM | Last Updated on Wed, Oct 17 2018 8:10 AM

KCR Released TRS Partial Manifesto - Sakshi

రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నరు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నరు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరో అస్త్రం విసిరారు. పాక్షిక మేనిఫెస్టో పేరుతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే మంగళవారం పలు కీలక హామీలను ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బాగా పేరు తెచ్చిన పథకాలను మరింత విస్తృతం చేయడంతోపాటు పలు కొత్త వాటిని చేర్చారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంలో ప్రభావం చూపిన రైతు రుణ మాఫీని మళ్లీ చేర్చారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈసారి పకడ్బందీగా, రైతులకు ఇబ్బంది లేకుండా మాఫీ చేస్తామని చెప్పారు. ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వయం సహాయక బృందాలకు 75% నుంచి 80% సబ్సిడీతో వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ఈ బృందాల్లోని వారిని ఉద్యోగులుగా నియమించి వీటిని విజయవంతంగా అమలు చేస్తామని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆసరా పథకంలో మార్పులు చేస్తామని, ప్రస్తుతం 65 ఏళ్లకు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లను 57 ఏళ్లు పూర్తి కాగానే ఇస్తామన్నారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఉన్న ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.2,016కు, అలాగే వికలాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచుతామని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3,016 చొప్పున భృతి చెల్లిస్తామని తెలిపారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంలో మార్పులు చేస్తున్నామన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని, లేని వారికి నిర్మించి ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెతామన్నారు. ఈ పథకం విధివిధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిరు ఉద్యోగులకు మరింత వేతనాలు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటుందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీగా ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం పాక్షిక మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు.
 
వారికి ఎన్నికలు రాజకీయ క్రీడ... మాకు టాస్క్‌... 
‘మా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. పలు అంశాలపై పార్టీ ఏం చెబుతుందని ప్రజలు వారిని అడుగుతున్నారు. మా అభ్యర్థులు ప్రజలకు చెప్పేందుకు వీలుగా పాక్షిక మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి క్రోడీకరించి ముఖ్యమైన అంశాల అమలు తీరులో మంచి చెడులు, పూర్వాపరాలు, అమలు తీరుపై చర్చించాం. ఉద్యోగుల నుంచి 20కిపైగా వినతులొచ్చాయి. చిన్న ఉద్యోగులు వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తాం. నాలుగేళ్లలో నన్ను, మా మంత్రులను, ఎమ్మెల్యేలను పలుసార్లు పలు సందర్భాల్లో కొందరు కొన్ని అడిగారు. రాజకీయాలు, ఓట్లు, ప్రలోభాల కోసం కాకుండా హేతుబద్ధీకరణ పద్ధతిలో పరిశీలించాం. టీఆర్‌ఎస్‌ తెలంగాణ సాధించిన పార్టీ. మిగిలిన పార్టీలకు ఎన్నికలు ఒక రాజకీయ క్రీడ. మాకు మాత్రం ఒక పని (టాస్క్‌). నిర్ధిష్ట లక్ష్యాలు, పటిష్ట ఆలోచనలను చెప్పి ముందుకు పోతాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు అర్థిక అంచనాలు తెలియవు. కరెంట్, మంచినీరు, వలసలు అన్ని సమస్యల ప్రభావం ఉండె. ఒక పథకాన్ని ప్రారంభించాలంటే ఆందోళనలు ఉండేవి. అందుకే కళ్యాణలక్ష్మీ పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీలకే.. అదీ రూ.51 వేలతోనే అమలు చేశాం. ఏటా ఎన్ని పెళ్లిల్లు అవుతాయనే సమాచారం లేదు. అన్నింటిపై స్పష్టత వచ్చాక బీసీలకు, ఆ తర్వాత అగ్రవర్ణాల్లోని పేదలకు అమలు చేస్తున్నాం. ఆర్థిక పురోగతిపై అంచనా వస్తున్న కొద్దీ ఇచ్చే మొత్తాన్ని పెంచాం. మూడో ఏడాదిలో రూ.75 వేలు, నాలుగో ఏడాదిలో రూ.1,0,116కు పెంచాం. ప్రజలకు ప్రలోభాలు పెట్టి తమాషాలు చేయొద్దు. అడ్డం పొడుగు మాట్లాడొద్దు. అర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి.
 
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం... 
వచ్చే ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహకారం లేని పరిస్థితిలోనే అంచనా వేశాం. వచ్చే ఐదేళ్లలో రూ.10.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అప్పుల తీర్చే కార్యక్రమం కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లించాలి. దీంతో మరో రూ.1.30 లక్ష కోట్లు సమీకరించే అవకాశం వస్తుంది. మొత్తంగా తొమ్మిది లక్షల కోట్ల నిధులు ఉంటాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండి ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తే పది లక్షల కోట్లకు చేరుతుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జీవన విధానం విధ్వంసమైంది. ప్రధానంగా రైతులు, రైతు కూలీలు ఆగమయ్యారు. ఉద్యమ సమయంలో హెలికాప్టర్‌లో వెళ్తూ జయశంకర్‌ సార్, నేను గ్రామాల పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లం. తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకునేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఐదేళ్ల దీన్ని కొనసాగిస్తాం. రైతును రాజును చేయాలి. వారికి పూర్వ వైభవం రావాలి. మొదట ట్రాక్టర్లకు రవాణా పన్ను, నీటి తీరువా రద్దు చేశాం. పెట్టుబడి సాయం అద్భుత పథకం. రైతు బీమా గురించి ప్రపంచ వ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటున్నరు. కోతలను పరిష్కరించి 24 గంటలపాటు సాగుకు ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నం. గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల టన్నులకు పెంచాం. రైతు సమన్వయ సమితులతో పంట కాలనీలు, మద్దతు ధర కల్పించే చర్యలు తీసుకుంటున్నం. ఇవన్నీ రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చినయ్‌.

42 లక్షల మంది రైతులకు లబ్ధి... 
2021 జూన్‌ వరకు రాష్ట్రంలో కచ్చితంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు, డిండి వంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రైతులు అప్పుల నుంచి బయటపడి, పెట్టుబడి ఖర్చులను వారే భరించే స్థితికి రావాలి. రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నారు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ముంబైలోని లుసిడ్‌ పాపడ్‌ ఇదే తరహాలో మొదలైంది. ఇప్పుడు ఆ పాపడ్‌ దేశ వ్యాప్తంగా అన్ని హోటళ్లలో ఉంటుంది. ఏకంగా రూ.1,100 కోట్ల టర్నోవర్‌తో ఈ సంస్థ నడుస్తోంది. రైతు సమన్వయ సమితిలోని వారికి గౌరవ వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నరు. ఇకపై 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో అదనంగా 8 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంక్షేమ విభాగాల్లో చేసే ఖర్చు చాలా సంతృప్తినిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వీటిని అమలు చేస్తాం. ప్రస్తుత బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించలేదు.


ముందే చెప్పిన ‘సాక్షి’ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో రుణమాఫీ, పింఛన్ల పెంపు అంశాలు ఉన్నట్లు మంగళవారం(16న) ‘సాక్షి’లో ప్రచురించిన కథనం..
 
నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు... 
నిరుద్యోగ భృతి అమలులో ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తం. ఎవరెవరు నిరుద్యోగులో తేల్చేందుకు కొంత సమయం పడుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలోనూ ఈ సమాచారం స్పష్టంగా లేదు. నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందిస్తం. అర్హులను తేల్చేందుకు మూడునాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ పథకం అమలు సాధ్యమవుతుంది. టీడీపీ, కాంగ్రెస్‌లు నిర్మించిన ఇళ్ల లెక్కలను చూస్తే జనాభా కంటే ఎక్కువ ఉన్నయ్‌. ఒక్క మంథని నియోజకవర్గంలోనే కుటుంబాల కంటే 40 శాతం ఎక్కువ ఇళ్లను నిర్మించినట్లు రికార్డులున్నయ్‌. లబ్ధిదారులుగా పేదలు ఉన్నరు. ఎవరిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో రుణాలపై ఇళ్లు నిర్మించుకున్న వారికి బ్యాంకుల్లో ఉన్న రూ.4,136 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. మేం వంద శాతం ఉచితంగా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరమని అంచనా ఉంది. ఏటా 2 లక్షల చొప్పున నిర్మించాలని అనుకున్నం. స్థలం సమస్య వచ్చింది. అందుకే మార్పులు చేశాం.


టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఈటల, కేశవరావు తదితరులు

అగ్రవర్ణ పేదలూ అడుగుతున్నరు.. 
పేదరికానికి కులం లేదు. అగ్రవర్ణాల్లోని పేదలకు మాకు ఏదైనా చేయాలని అడుతున్నరు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రెడ్లు, వైశ్యులు అడిగారు. అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉండాలనేది కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది. కొప్పుల ఈశ్వర్, నగేశ్‌ తదితరులు ఈ కమిటీలో ఉంటరు. ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అన్ని విభాగాల్లోని చిరుద్యోగుల వేతనాలు పెంచాం. వారు మళ్లీ ఆశీర్వదిస్తే మీ కడుపులు నింపుతం. ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటయ్‌. ఉద్యోగులకు బెంబేలు, బాధ వద్దు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో చెప్పినవి చేయలేదు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేదు. మాది విశ్వసనీయ ప్రభుత్వం. ఆపద్ధర్మ సీఎం అయినా నేను అన్ని వివరాలు తెలుసుకుంటున్నా.  రైతుల రుణమాఫీలో గతసారి వచ్చినట్లు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తం’ అని వివరించారు.
 
తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు... 
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించగానే ఆ పార్టీ నేతలు, శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు డప్పు చప్పులతో హడావుడి చేశారు. టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.  
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement