సాక్షి, హైదరాబాద్ : ‘అయ్యా చంద్రబాబు నాయుడు నీకో నమస్కారం! తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అనవసరంగా మీరు.. మీ స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారు’ అని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.
ఇంకా ఎమన్నారంటే.. ‘ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదు.. ప్రజలు గెలవాలి. అలా అయితేనే ప్రజల అజెండా అమలై వారికి మేలు జరుగుతోంది. గత పాలకులు నగరాన్ని నాశనం చేశారు. వర్షం నీళ్లను తీసుకుపోయే కాలువలను కూడా ధ్వంసం చేశారు. కనీసం టాయిలెట్లు నిర్మించలేదు. చాలా అధ్వానమైన పరిస్థితి ఉండేది. అధికారంలోకి రాగానే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోని పని మొదలుపెట్టాం. పేదల అభ్యున్నతికి కృషి చేశాం. గుడిసేలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చాం. రూపాయికి నీటి కనెక్షన్ ఇచ్చాం. కరెంట్ బకాయిలను మాఫీ చేశాం. ఎల్‌ఈడీ వెలుగుల కింద నగరం ఇప్పుడు మెరుస్తుంది. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. నాలుగున్నరేళ్లలో ఒక్క మతకల్లోలం లేదు. కర్ఫ్యూలు లేవు. గుడుంబా అమ్మకాలు.. గుండాలు.. పేకాట క్లబ్బులు లేవు. 12 మున్సిపాలిటీల్లో నీటికి చాలా కటకట ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భవిష్యత్తులో 500 పైచిలుకు బస్తీ దవాఖానాలు పెట్టే యోచనలో ఉన్నాం. నగరంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.
హైదరాబాద్ విశ్వనగరం. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. సర్వమతాలకు నిలయం. ప్రతి రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అనేక అపోహలు సృష్టించారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు అనవసరంగా స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారికి జీహెచ్‌ఎంసీలో టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కడికెళ్లినా గర్వంగా హైదరాబాదీలమని చెప్పండి. మేం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డాం. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలెందుకు. ప్రేమ ఉంటే చిచ్చు పెడ్తరా? రేపు మాపో డూప్లికేట్ సర్వే వెల్లడిస్తారు. ఇదంతా ఓ మీడియా సంస్థ, కాంగ్రెసోళ్లు కలిసి కుట్ర చేస్తున్నారు. 100 సభలనంతరం తిరుగొచ్చిన నేను కచ్చితంగా 100 సీట్లపై గెలుస్తామని చెబుతున్నా. జీహెచ్‌ఎంసీ తీర్పే రిపీట్ కాబోతుంది. ఈ ఎన్నికలనంతరం ఫెడరల్ ఫ్రంట్‌కు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మతసామరస్యంతో అభివృద్దిలో దూసుకుపోతున్న తెలంగాణకు బాసటగా నిలుస్తూ.. తమ అభ్యర్థులను గెలిపించి ఆశీర్వదించాలి’ అని కేసీఆర్ ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment