
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందించారు.
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందన్నారు. అధికారిక నిర్ణయం రాకముందే ఏపీ బీజేపీ నేతలు మాట్లాడడం, విమర్శించడం తగదని హితవు పలికారు. రాష్ట్రం, జాతీయ స్థాయిలో దీనిపై చర్చించిన తర్వాత తమ పార్టీ అభిప్రాయం చెబుతామన్నారు. మూడు రాజధానులు అంశంపై కమిటీ నివేదిక వచ్చాక, విధివిధానాలు తేలిన తర్వాతే తమ అభిప్రాయం చెప్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అప్పటి వరకు బీజేపీ నాయకులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
కాగా, ఏపీలో వికేంద్రీకరణకు మొగ్గుచూపుతూ జీఎన్ రావు కమిటీ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కాంక్షిస్తూ జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది.