‘తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధే మా లక్ష్యం’ | Ambati Rambabu Comments On Three Capitals Plan | Sakshi
Sakshi News home page

‘గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాదు.. వాస్తవ అభివృద్ధికి కృషి’

Published Thu, Dec 26 2019 6:56 PM | Last Updated on Thu, Dec 26 2019 7:17 PM

Ambati Rambabu Comments On Three Capitals Plan - Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించామని చెప్పారు. రాజధాని నిర్మాణ విషయంలో అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులను సంతోష పరిచేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అమరావతిలో గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాకుండా వాస్తవ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

అమరావతిలో ఉన్న నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. రాజధాని అంటే కొత్త పట్టణాలు కాదు అని, రాజధాని అంటే సచివాలయం, శాసనసభ, హైకోర్టు నిర్మించడం అని అన్నారు. రాజధాని కోసం నగరాన్ని నిర్మించడం కాదు, నగరంలోనే రాజధాని పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. తాత్కాలిక రాజధానిపై ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారని, ఈ రాజధానిని ఎలా ఉపయోగించాలనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడులతో రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు.

గత ఐదేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు నాయుడు రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టారని, అయినప్పటికీ ఒక్క శాశ్వత భవనం నిర్మించలేకపోయారని విమర్శించారు. అమరావతిని పూర్తి చేయాలంటే రూ. లక్ష పదివేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అంత డబ్బును అప్పుగా తీసుకొస్తే వడ్డీలు చెల్లించడానికే కోట్ల రూపాయాలు అవుతాయన్నారు. డబ్బులు విచ్చలవిడిగా ఉంటే రాజధాని ఎలాగైనా నిర్మించుకోవచ్చని, కానీ రాష్ట్ర ఖజానాలో అంత డబ్బులేదన్నారు. తక్కువ ఖర్చుతో ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపైనే తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంబటి పేర్కొన్నారు. 

బాబు అనాలోచిత నిర్ణయాలతో అప్పుల భారం పెరిగింది
చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో అప్పుల భారం పెరిగిపోయిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. రూ. లక్షా పదివేల కోట్లతో రాజధాని నిర్మాణం అసాధ్యమన్నారు. రాజధాని విషయంలో అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్‌నిర్ణయం తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒకే చోట లక్షకోట్ల రూపాయల పెట్టుబడి అవసరమా అనేది జీఎన్‌ రావు కమిటీ సూచిందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిని నిట్టనిలువునా ముంచిన చంద్రబాబు... ఇప్పుడు రైతులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement