
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంచిన రోజు నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత త్వరలోనే విద్యుత్ చార్జీలను పెంచుతామని చెప్పడం ద్వారా కేసీఆర్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఆరోపించారు. ఓట్లు, ఎన్నికలు తప్పితే కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రజల జీవితమే విద్యుత్‌పై ఆధారపడి ఉందని, విద్యుత్ కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడని చరిత్ర రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. తన స్వార్థం, వ్యక్తిగత లాభం కోసం ఎక్కువ ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసి జెన్‌కోను నష్టాల పాలు చేశారని విమర్శించారు. ఇప్పుడు తాను చేసిన తప్పును ప్రజలపై రుద్దాలని చూడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.