
యాదగిరిగుట్ట: యుద్ధం చేసే వాడికి కత్తి ఇవ్వకుండా.. ఇంట్లో కూర్చున్నోడికి ఇస్తే ఏమి లాభం అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, రాష్ట్రంలో పార్టీ గట్టిగా ఉండాలంటే టీపీసీసీ పదవిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కాకుండా కొత్త వాళ్లను పెట్టాలని, రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచి అంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు.
టీపీసీసీ ఎప్పుడు మారినా సీనియర్ నాయకుడిగా ఉన్న తనకే వస్తుందనే నమ్మకం ఉందని వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉండి వైఎస్సార్, వైఎస్ జగన్ ఇద్దరూ పోరాడినట్లు ప్రజా సమస్యలపై తాను అలాగే ఉద్యమిస్తానన్నారు.
అధిష్టానం అనుమతితో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, బస్సు యాత్ర చేపడతానని వెల్లడించారు. అందరికీ మళ్లీ మళ్లీ చెబుతున్నా.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నా రని అంటున్నారు.. ఎవరు ఎక్కడికి పోయినా తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ కక్ష కట్టారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment