
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందించిన కేటీఆర్.. బాధితులకు అండగా నిలిచారు. తాజాగా కేటీఆర్ ఆదివారం సాయంత్రం ట్విటర్‌లో.. ఆస్క్ కేటీఆర్ నిర్వహించారు. నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు. పలువురు నెజటిన్లు తమ సమస్యలను ప్రస్తావించగా.. వాటిపై దృష్టిసారిస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్.. అన్న మీరు సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించాడు. ‘మీరు ఒకవేళ సినిమాలో నటిస్తే.. మేము మీ సినిమా ద్వారా ఒక మంచి మేసేజ్ ఆశిస్తున్నామ’ని పేర్కొన్నాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘థ్యాంక్స్.. కానీ నాకు ఫుల్ టైమ్ జాబ్ ఉంది’ అని తెలిపాడు. ఓ నెటిజన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎలా ఉందని ప్రశ్నించగా.. వైఎస్ జగన్ ఆరు నెలల పాలన బాగుందని కేటీఆర్ జవాబిచ్చారు.
అలాగే కేటీఆర్ ఇచ్చిన కొన్ని రిప్లైలు..
ప్రశ్న: టీ హబ్ ఫేజ్ 2 ఎప్పుడు ప్రారంభిస్తారు?
జవాబు : 2020 ఫస్టాపు లోపు
ప్ర : ప్రస్తుత రాజకీయాల్లో మీకు ఎవరు స్పూర్తి?
జ : రెండో ఆలోచన లేకుండా కేసీఆర్ గారు.
ప్ర : కొంపల్లిలో కొత్త ఐటీ పార్క్ ఎప్పుడూ ప్రారంభిస్తారు?
జ : ప్రస్తుతం భూసేకరణ జరుగుతుంది.
ప్ర : సార్ మన సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం ఎప్పుడు?
జ : అందుకు సంబంధించిన పని జరుగుతోంది.
ప్ర : సైబర్ గేట్ వే బస్టాప్ వద్ద చాలా మంది రోడ్డు దాటడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా వెళ్లడం లేదు. కావున ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను.
జ : ఇటీవలే 50కిపైగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు మంజూరు అయ్యాయి.
ప్ర : మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రభావితం చేసిన అంశం
జ : తెలంగాణ ఉద్యమం
ప్ర : కాళేశ్వరం జలాలు ఎప్పటిలోగా ఎగువ మానేరుకు వస్తాయి?
జ : జూన్ 2020 నాటికి