‘హడావుడి చేయడం కాదు’ | KTR Speech In Telangana excellence awards 2018 | Sakshi
Sakshi News home page

‘హడావుడి చేయడం కాదు’

Published Tue, May 22 2018 2:08 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

KTR Speech In Telangana excellence awards 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే ఉత్పన్నమయ్యే తొలి ప్రశ్న.. ఎవరు చేశారని? అలాగాకుండా.. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ తప్పుకు ఆస్కారం ఎలా ఏర్పడిందని ప్రశ్నించడం సరైన పద్ధతి..’’అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. అంతేతప్ప కొందరు అధికారులను సస్పెండ్‌ చేసి తమాషా చేయడం, ఏడెనిమిది గంటల పాటు అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు, హడావుడి చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని సెంటర్‌ ఫర్‌ మీడి యా స్టడీస్‌ సంస్థ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సురేశ్‌ చందా చేసిన విమర్శలపై కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సోమవారం హైదరాబాద్‌ లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ‘తెలంగాణ ఎక్సలెన్సీ’ పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అవినీతి అంశంపై సురేశ్‌ చందా వ్యాఖ్యలు చేయగా కేటీఆర్, కడియం శ్రీహరి ప్రతిస్పందించారు. కొందరు నేతలు, అధికారులు అవినీతిపరులు ఉండవచ్చని.. అందరూ అవినీతి పరులే అన్నట్టుగా విమర్శించడంలో అర్థం లేదన్నారు. 

అధికారులు అర్థం చేసుకోవాలి..: కేటీఆర్‌
ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో పనులను త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడం జరుగుతుందని, ఈ విషయాన్ని అధికారులు అర్థం చేసుకోవాలని కేటీఆర్‌ కోరారు. చాలా రాజకీయ పార్టీలు మళ్లీ ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తాయని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అదే ఐఏఎస్‌ అధికారుల సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, వారు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. రాజకీయ నాయకుల పదవీకాలం ఐదేళ్లు మాత్రమే ఉంటుందని, తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలవడం కోసం ప్రజల పనులు చేయటానికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్న ‘మినిమమ్‌ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్‌ గవర్నెన్స్‌ (స్వల్ప ప్రభుత్వం.. అధిక పాలన)’సాధన దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే పౌర సేవలను అందుకునేలా పాలన ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ప్రజాదర్బార్‌ నిర్వహించి గ్రామ, మండల స్థాయి అధికారులు మంజూరు చేయాల్సిన పింఛన్లను ఇక్కడి నుంచి మంజూరు చేస్తే విఫల ప్రభుత్వానికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, మండల స్థాయిలో జరగాల్సిన పనులు అక్కడే జరగాలని స్పష్టం చేశారు. తాను అమెరికాలో ఆరేళ్ల పాటు నివాసమున్నానని.. కేవలం డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్ట్‌ కోసం మాత్రమే అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లానని చెప్పారు. ‘డీసెంట్రలైజ్‌ (వికేంద్రీకరణ), డిజిటలైజ్‌ (కంప్యూటరీకరణ), డెమొక్రటైజ్‌ (ప్రజాస్వామికరణ)’అనే ‘త్రీడీ’మంత్రంతో పాలన సాగిస్తే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కొత్తగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టిందన్నారు. రాష్ట్రం గత రెండేళ్లుగా ఈఓడీబీలో అగ్రస్థానంలో ఉందని.. పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతుల కోసం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

అందరినీ ఒకేగాటన కట్టొద్దు: కడియం
కొందరు రాజకీయ నేతలు, అధికారులు అవినీతిపరులు కావొచ్చని.. అందరూ అవినీతిపరులేనని విమర్శించడంలో అర్థం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. శాసన వ్యవస్థ, అధికార గణం, న్యాయస్థానాల తీర్పులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని.. ఈ పరిస్థితిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మరొకరిపై నెపం నెట్టేసి తప్పించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో అందరూ భాగస్వాములేనన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తన తండ్రి వ్యవసాయ కూలీ అని, తనకు ఏ మాత్రం భూమి వారసత్వంగా రాలేదని కడియం పేర్కొన్నారు. 31 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎకరా పొలం కూడా సంపాదించలేకపోయానని.. 24 ఏళ్ల కిందే మంత్రి అయిన తనకు హైదరాబాద్‌లో రూ.కోటి విలువ చేసే ఇల్లు కూడా లేదన్నారు. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు.. పక్షపాతంతోగానీ, ఎవరిపట్లనైనా ముందే ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండడంకానీ మంచిది కాదని ఐఏఎస్‌ అధికారులకు సూచించారు. ఫైళ్లను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుని వెనక్కి పంపాలని.. మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

అవినీతి పెచ్చరిల్లుతోంది..: సురేశ్‌ చందా
ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఫ్లైఓవర్‌ కుప్పకూలి అమాయకులు మృతి చెందారని.. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ఆస్పత్రి సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేశారని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి సురేశ్‌ చందా పేర్కొన్నారు. అలా దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో లంచాలు తీసుకోవడం సాధారణంగా మారిందని.. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదని వ్యాఖ్యానించారు. భారతదేశం సిఫార్సుల దేశమని.. సిఫార్సులు లేకుంటే ఇక్కడ ఏ పనీ జరగదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందజేస్తున్న ‘తెలంగాణ ఎక్సలెన్సీ’పురస్కారాల కోసం సైతం సిఫార్సులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇటీవల సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో గతేడాది 73 శాతం కుటుంబాలు ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చాయని, రాష్ట్రం అవినీతిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకత్వం, ప్రభుత్వాధికారులు చొరవ తీసుకుంటేనే ఈ పరిస్థితిలో మార్పు సాధ్యమవుతుందన్నారు. రాజకీయ అవసరాల కోసం జరిగే అధికార దుర్వినియోగానికి అడ్డుకట్టపడాల్సి ఉందన్నారు. సాంకేతికంగా తాను ప్రభుత్వం నుంచి బయట ఉన్నానని, అందుకే ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తనకు బాగా తెలుసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

లంచాల కోసం వేధిస్తున్నారు..
అధికారులు లంచాల కోసం కొర్రీలపై కొర్రీలు వేస్తూ బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే విధానంలో సంస్కరణలు అవసరమని సురేశ్‌ చందా పేర్కొన్నారు. బిల్లు సమర్పించిన రోజే చెల్లింపులు జరిపేలా ఆన్‌లైన్‌ విధానం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ శాఖలు సంబంధం లేని ఏవేవో పత్రాలను కోరే విధానానికి స్వస్తి పలికి.. పంజాబ్‌ తరహాలో పౌర సేవలను సరళీకృతం చేయాలని సూచించారు. కొందరు అధికారులు కావాలని నెలల తరబడి ఫైళ్లను తమ వద్దే పెట్టుకుంటున్నారని.. అందువల్ల ఫైళ్ల కదిలికలను ఆన్‌లైన్‌ చేసి ఏ ఫైల్‌ ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో తెలుసుకునే సదుపాయాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. రాష్ట్ర ఐటీ శాఖ చొరవ తీసుకుని బిల్లుల చెల్లింపులు, ఫైళ్ల కదిలికలు తదితర సేవలను ఆన్‌లైన్‌ చేయాలని కోరారు. పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డీజీ బీపీ ఆచార్య, సీనియర్‌ ఐఏఎస్‌లు శాలినీ మిశ్రా, అజయ్‌ మిశ్రా, రాజేశ్వర్‌ తివారీ, అధర్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement