సాక్షి, జనగామ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్.. మరోవైపు కాంగ్రెస్ పకడ్బందీగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా మెజారిటీ ఓట్లు రాబట్టుకుంటే విజయం సాధించవచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. 2009, 2014 ఎన్నికలతో పోల్చుతూ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతో లెక్కలు వేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడు నియోజకవర్గాల్లో జనగామ, ఆలేరు నియోజకవర్గాలపైనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి మంచి మెజారిటీ లభించింది. దీంతో అప్పుడు బూర నర్సయ్య గౌడ్ గెలుపు సులువుగా మారింది.
2014 ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థికి 29,084 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి 19,632 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా ఓట్లు రావడంతో టీఆర్‌ఎస్ విజయం ఖాయమైపోయింది. ఇప్పుడు మరోమారు జనగామ, ఆలేరు నియోజకవర్గాల నుంచి ఎక్కువ ఓట్లు వస్తే విజయం సాధించాలని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. 2018 డిసెంబర్‌లో జరిగిన శాసన ఎన్నికల్లో జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 29,538 ఓట్ల మెజారిటీ.. ఆలేరు నుంచి గొంగడి సునీతకు 33,289 ఓట్ల మెజారిటీ వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపుమీద ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరోమారు ఎక్కువగా మెజారిటీ వచ్చేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. భువనగిరి తమ ఖాతాలోనే అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తోంది.
నాడు తమ్ముడు.. నేడు అన్న..
భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు తమ్ముడు బరిలో దిగగా.. నేడు అన్న ఎన్నికల బరిలో ఉన్నాడు. 2009లో భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సమీప సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,888 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి రాజగోపాల్‌రెడ్డి ఆధిక్యత లభించింది. 2014 ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బరిలో నిలిచారు.
కాంగ్రెస్ పార్టీ సైతం జనగామ, ఆలేరు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. జనగామ నుంచి లీడ్ లభిస్తే విజయం సాధించవచ్చనే ఆలోచనతో క్యాడర్‌ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. జనగామ నుంచి టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజలకు కోమటిరెడ్డి సోదరులు సుపరిచితులు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆలేరు, జనగామ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేయడం ఆసక్తిగా మారుతోంది. రెండు పార్టీలకు రెం డు నియోజకవర్గాలు ప్రతిష్టగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment