
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయని, అయితే సభ సజావుగా లేనందున తీర్మానాన్ని తీసుకోలేకపోతున్నానంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే తదితర పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో సభాపతి వెంటనే సభను వాయిదా వేశారు.
50 మంది సభ్యులను లెక్కించలేను..
సభ తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగానే వివిధ విభాగాలకు సంబంధించిన పత్రాలను మంత్రులు, సభ్యులు సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో వెల్‌లో టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే సభ్యులే ఉన్నారు. ఈ సమయంలో సభాపతి తనకు వైఎస్సార్ సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నరసింహం నుంచి అవిశ్వాస తీర్మానం నోటీసులు వచ్చాయని ప్రకటించారు. సభ సజావుగా లేకపోవడంతో తీర్మానం తీసుకోలేక పోతున్నానని పేర్కొంటూ సభను సోమవారానికి వాయిదా వేశారు.
నోటీసులు వచ్చాయని సభాపతి ప్రకటిస్తున్న సమయంలో వైఎస్సార్ సీపీ , టీడీపీలకు చెందిన సభ్యులతో పాటు విపక్షాలన్నీ తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా లేచి నిలబడ్డాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాతో పాటు ఆ పార్టీ ఎంపీలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సభ్యులు, సీపీఎం, ఎంఐఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పార్టీల వారు లేచి నిలుచున్నారు. దాదాపు 100 మంది మద్దతుతెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment