
చాడ వెంకట్ రెడ్డి, కోదండ రాం, ఎల్ రమణ
హైదరాబాద్: ఒక వైపు టీఆర్‌ఎస్,అభ్యర్థులను ముందే ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతూ ఉంటే..మరో వైపు మహా కూటమిలో సీట్ల వ్యవహారం తేలక అభ్యర్థులు ప్రచారంలో వెనకబడిపోతున్నారు. నిజానికి మహా కూటమిలో కాంగ్రెస్‌దే పెద్దన్న పాత్ర. తెలంగాణ జన సమితి(టీజేఎస్), సీపీఐ, టీడీపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతల వెంట పడుతూ సీట్ల వ్యవహారం తొందరగా తేల్చాలని వేడుకుంటున్నారు. ఎన్ని సీట్లు తమకు కేటాయిస్తారో, తమకు బలంగా ఉన్న నియోజకవర్గాలను కేటాయిస్తారో లేదో అన్న అనుమానం భాగస్వామ్య పక్షాల నేతల్లో తలెత్తుతోంది. దీనిపై తాజాగా మహాకూటమిలోని టీజేఎస్, సీపీఐ, టీడీపీ పార్టీలు బుధవారం సమావేశమయ్యాయి. సమావేశం ముగిసిన తర్వాత కూటమి నాయకులు విలేకరులతో మాట్లాడారు.
టీజేఎస్ అధినేత కోదండ రాం విలేకరులతో మాట్లాడుతూ..పొత్తులకు సంబంధించి ఒక స్పష్టతకు రావాలనే సమావేశం అయ్యామని తెలిపారు. నిరంకుశ పాలన అంతం చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. కూటమి నిర్మాణంలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీదేనని అభిప్రాయపడ్డారు. తాము కూడా విడిగా ప్రచారం చేయలేక కూటమిగా ప్రచారం చేయాలనుకున్నామని తెలిపారు. కూటమి ఏర్పాటు కృషి బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని, దాని మీద త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి మరింత బలోపేతం చేయాలని గుర్తించామని, ఆ బాధ్యత మాపై ఉందని వ్యాక్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. మా కూటమి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మేనిఫెస్టోను ప్రజా మేనిఫెస్టోగా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.
టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే రాజకీయ గుత్తాధిపత్యంతో పాలించిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రూ.వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. నేరేళ్ల బాధితులతో కేటీఆర్ ప్రమేయం లేదని బలవంతంగా చెప్పించారని అన్నారు. మహా కూటమి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని, ఇది దేశం మొత్తం ఏర్పడబోతోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment