సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని రాజకీయ పార్టీల మధ్య సీట్ల పంపకాల అంశం ఎటూ తేలడం లేదు. అంతర్గతంగా పార్టీలో సీట్లకు పోటీ ఎక్కువగా ఉండటం, వాటిని సర్దుబాటు చేసే క్రమంలో అనేక రాజకీయ సమీకరణలు అడ్డు వస్తుండటంతో పీటముడి వీడటం లేదు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబించడంతో కూటమిలోని మిగతా పార్టీలన్నీ ఎటూపాలుపోని పరిస్థితిలో పడ్డాయి. దీంతో కాంగ్రెస్‌పై టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఒత్తిడి తెచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదే విషయమై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి శనివారం టీజేఎస్ అధినేత కోదండరాంతో చర్చలు జరిపారు. టీడీపీకి 10 నుంచి 12 సీట్లు, సీపీఐకి 5 సీట్లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని తెలియజేసి ఆ స్థానాల వివరాలను అందించారు. అలాగే టీజేఎస్ పోటీ చేయాలనుకుంటున్న జాబితాపైనా చర్చించారు.
తమకు కనీసం 15 సీట్లు కేటాయించాలని కోరుతున్నట్లు కోదండరాం వారికి చెప్పినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ కేవలం 6 నుంచి 8 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సుముఖత చూపుతుండటంతో సీట్ల పంపకాల అంశం ఎటూ తేలడం లేదని వివరించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం 119 స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుండటంపై అన్ని పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కూటమి పక్షాలను పట్టించుకోకుండా వారికి కేటాయించే స్థానాలపై స్పష్టత ఇవ్వకుండా తమ పని తాము చేసుకొని పోతుంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయన్న దానిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. శనివారం ఓ ప్రైవేటు హోటల్‌లో మరోసారి భేటీ అయిన కూటమి నేతలు సీట్ల కేటాయింపుపై చర్చించారు.
ఉమ్మడి మేనిఫెస్టో ఆలస్యం...
ఈ నెల 2కల్లా కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల ముందుకు తేవాలని పార్టీలన్నీ భావించినా అది ఆలస్యమవుతూ వస్తోంది. దసరాలోగా సీట్ల పంపకాలపై స్పష్టత వస్తే ఆ తర్వాత మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.
కాంగ్రెస్‌పై ఒత్తిడి తెద్దాం!
Published Sun, Oct 14 2018 4:39 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment