సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి వెనుక టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరి సహా ఇంకెవరి ప్రమేయం గానీ, కుట్ర గానీ లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు. శ్రీనివాసరావు పది నెలల ముందు 2017 డిసెంబర్‌లోనే దాడికి పథకాన్ని రచించాడని తెలిపారు. పబ్లిసిటీ, సానుభూతి కోసమే ప్రతిపక్ష నేతపై దాడికి పాల్పడ్డాడని, తాను జగన్ అభిమానినని చెప్పాడని పేర్కొన్నారు. హైకోర్టు అనుమతించాక ఈ కేసుపై చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో పురోగతిని కమిషనర్ బుధవారం విలేకరులకు వివరించారు. సీపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పక్షులంటే ఇష్టమని ఫ్లెక్సీపై ముద్రించాడు
‘తూర్పు గోదావరి జిల్లా థానేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాసరావు మూలపాలెం ఎన్‌పీఎం కాలేజీలో ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాడు. 2009–16 మధ్య గోవా, కర్ణాటక, కువైట్, హైదరాబాద్‌లో వెల్డర్, వంట పని చేశాడు. 2017లో రాజమండ్రి బాలాజీ బేకరీలో కేక్ మాస్టర్‌గా కొన్నాళ్లు, అమలాపురంలో కుక్‌గా కొన్నాళ్లు చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 27న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలోని అఖిల్ స్టూడియోలో ఫోటో దిగాడు. 30న పి.గన్నవరం లేపాక్షి ఫ్లెక్సీలో వైఎస్ జగన్‌తో తన ఫోటో ఉండేలా ఫ్లెక్సీ ప్రింటింగ్‌కు ఆర్డరిచ్చాడు. పక్షులంటే తనకు ఇష్టమని గరుడ పక్షిని కూడా ముద్రించాడు. ఆపరేషన్ గరుడ కాదు. 31 రాత్రి థానేలంకలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. 2018 జనవరిలో రాజుపాలెంలో కోడిపందాలు చూడటానికి వెళ్లి అక్కడ రెండు కత్తులు కొనుగోలు చేశాడు. అదే నెల 28న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో కుక్‌గా చేరాడు. అప్పట్నుంచి తన స్వగ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అక్టోబర్ మొదటి వారంలో తన ఇంటికెళ్లినప్పుడు తన సమీప బంధువు విజయదుర్గతో తొమ్మిది పేజీలు, తన గదిలో ఉంటున్న రేవతీపతితో ఒక పేజీ లేఖ రాయించాడు. 17న తిరిగి విశాఖ వచ్చి తానుంటున్న గదిలో కత్తిని స్టెరిలైజ్ (వేడినీటిలో మరిగించడం) చేశాడు. ఈ కత్తి ఎందుకుని సహోద్యోగులు శిరీష, ప్రసాద్‌లు అడగ్గా రెస్టారెంట్‌లో కూరగాయలను అందమైన ఆకృతిలో మలచడానికని చెప్పాడు.
అక్టోబర్ 18నే దాడికి ప్లాన్
తొలుత అక్టోబర్ 18న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడికి ప్లాన్ వేశాడు. కానీ దసరా సందర్భంగా ఒకరోజు ముందు అంటే 17నే జగన్ హైదరాబాద్ పయనమవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత 25 మధ్యాహ్నం జగన్ విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారని విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకాంత్ అనే వ్యక్తి నుంచి రెస్టారెంట్‌లో పనిచేస్తున్న హేమలత ద్వారా తెలుసుకున్నాడు. 25 ఉదయం 4.55కి కోడిపందాల కత్తిని పర్స్‌లో పెట్టుకుని తన ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరాడు. 9 గంటల సమయంలో కత్తిని మరోసారి స్టెరిలైజ్ చేశాడు. జగన్ మధ్యాహ్నం 12.21–25 గంటల మధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకుని వీఐపీ లాంజ్‌కు వెళ్లారు. శ్రీనివాస్ బ్యాగులో రాసి ఉంచిన లేఖతో పాటు రెండు మంచినీళ్ల బాటిళ్లు వెంట తీసుకుని జగన్ దగ్గరకు ఫోటో దిగే నెపంతో వెళ్లాడు. కత్తితో జగన్ భుజంపై పొడిచాడు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు అతని వద్ద నుంచి కత్తిని లాక్కున్నారు.
దాడికి పాల్పడిన వెంటనే పోలీసు, సీఐఎస్‌ఎఫ్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతకు ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యురాలితో ప్రాథమిక చికిత్స అందించారు. విమానం బయలుదేరే సమయం కావడంతో జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. కత్తి దాడితో జగన్ భుజంపై ఒక సెంటీమీటరు వెడల్పు, 3.5 సెంటీమీటర్ల లోతులో గాయమైంది. అంతకుముందు తాను జగన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించబోతున్నానని, టీవీల్లో కనిపిస్తానని తనకు పరిచయం ఉన్న ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన షేక్ అమ్మాజీతో అక్టోబర్ 14, 15 తేదీల్లో శ్రీనివాస్ ఫోన్‌లో చెప్పాడు. 17న మరోసారి ఆమెకు అదే విషయాన్ని చెప్పడంతో తాము వెటకారమని నవ్వుకున్నట్టు అమ్మాజీ చెప్పింది. శ్రీనివాస్ వద్ద 11 పేజీల లేఖ ఉంది. అందులో తొలి తొమ్మిది పేజీలు సమీప బంధువు విజయదుర్గ, పదో పేజీ రూమ్‌మేట్ రేవతీపతి, 11వ పేజీ శ్రీనివాస్ రాశాడు. ఈ పేజీల దస్తూరీ వీరిదేనని ఎఫ్‌ఎస్‌ఎల్ తేల్చింది. ఎయిర్‌పోర్టులో ఉద్యోగంలో చేరడానికి అవసరమైన ఎన్‌ఓసీని 2018 జనవరి 28, ఏప్రిల్ 6న విశాఖ పరిధిలో పోలీసులు ఇచ్చారు. ఫ్యూజన్‌ఫుడ్స్‌కు అన్ని అనుమతులూ ఉన్నాయి. శ్రీనివాసరావు డిపార్చర్ ఏరియాలో తిరగడానికి అనుమతి ఉంది.
కుట్రకోణం లేదు..పబ్లిసిటీ కోసమే..
ఈ కేసులో 92 మంది సాక్షులను విచారించాం. వారి నుంచి వివరాలు సేకరించాం. నిందితుడి తన ఫోన్ నుంచి 1,110 కాల్స్ చేసినట్టు గుర్తించాం. కుట్రకోణంలో కూడా దర్యాప్తు చేశాం. ఇందులో అలాంటిదేమీ లేదు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ హర్షవర్థన్ చౌదరిని కూడా విచారించాం. శ్రీనివాస్ పబ్లిసిటీ కోసమే జగన్‌పై కత్తితో దాడి చేశాడు. దాడి సమయంలో ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాయకులు రామన్నదొర, కొండా రాజీవ్‌గాంధీ, ఎస్.సుధాకర్ ఉన్నారు.
బ్యాగులో ఉన్నందున లేఖ నలగలేదు
శ్రీనివాసరావు తమ ప్రాంతంలో నాలుగెకరాల భూమి కొనుగోలుకు ప్రయత్నించిన విషయం మాకు తెలియదు. నిందితుని వద్ద ఉన్న లేఖ బ్యాగులో ఉంచడం వల్ల నలగలేదు. శ్రీనివాసరావు, ఆయన కుటుంబ అకౌంట్లను పరిశీలించి అతని సోదరికి రమాదేవి అనే సహోద్యోగిని అకౌంట్ ద్వారా రూ.40 వేలు, 22 వేల చొప్పున బదలాయించినట్టు గుర్తించాం. ఘటన జరిగిన గంటలోనే ఫ్లెక్సీ బయట పడడం వెనక ఎలాంటి ముందస్తు వ్యూహం లేదు. ఈ కేసు పూర్తయ్యే వరకు సిట్ విచారణ కొనసాతుంది..’ అని సీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సిట్ ఇన్‌చార్జి బీవీఎస్ నాగేశ్వరరావు, ఏసీపీ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరి ప్రమేయమూ లేదు: లడ్హా
Published Thu, Jan 3 2019 4:17 AM | Last Updated on Thu, Jan 3 2019 4:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment