గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి! | maheshwaram congress mla sabitha indra reddy join in trs party | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి సబితా ఇంద్రారెడ్డి!

Published Mon, Mar 11 2019 5:42 AM | Last Updated on Mon, Mar 11 2019 5:42 AM

maheshwaram congress mla sabitha indra reddy join in trs party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే.. అదే జిల్లాకు చెందిన నాయకురాలు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ నివాసంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భం గా కార్తీక్‌ రాజకీయ భవిష్యత్తుతో పాటు సబితకు మంత్రివర్గంలో స్థానంపై కేటీఆర్‌ నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. దీంతో సోమవారం అనుచరులతో సమావేశం కానున్న సబిత త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది.

పలు ప్రతిపాదనలపై చర్చ
ఒవైసీ నివాసంలో కేటీఆర్‌తో జరిగిన భేటీలో సబితా ఇంద్రారెడ్డి కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై టీఆర్‌ఎస్‌ నుంచి సంపూర్ణ హామీ లభించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో తొలి మహిళా హోంమంత్రిగా రికార్డు సృష్టించిన సబిత.. తెలంగాణలో తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించే విధంగా సానుకూల చర్చలు వీరి మధ్య జరిగినట్టు సమాచారం. సబితకు మంత్రిపదవి ఇవ్వడం పట్ల కేసీఆర్‌ కూడా సానుకూలంగా ఉన్నారని కేటీఆర్‌ సంకేతాలిచ్చారని సమాచారం.

అయితే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎమ్మెల్సీనా, ఎంపీనా అన్న విషయంలో మాజీ మంత్రి, సబిత సన్నిహిత బంధువు పట్నం మహేందర్‌రెడ్డితో కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం. అవసరమైతే సబిత చేవెళ్ల ఎంపీగా టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. అదే అనివార్యమైతే మహేశ్వరం ఎమ్మెల్యేగా కార్తీక్‌ ఉంటారని, ఈ మేరకు కూడా భేటీలో చర్చలు జరిగాయని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పటి నుంచో అసంతృప్తి
టీపీసీసీ నాయకత్వం పట్ల సబిత చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో సంప్రదించకుండానే.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై గుర్రుగా ఉన్నారు. తన కుమారుడి కోసం అడిగిన రాజేంద్రనగర్‌ అసెంబ్లీ స్థానాన్ని పొత్తు పేరుతో టీడీపీకి ఇచ్చి చేజేతులా అక్కడ ఓటమి పాలయ్యామనే భావనలో ఆమె ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం వైఖరిలో మార్పు లేకపోవడంతో సబితలో అసంతృప్తి మరింత పెరిగింది. దీనికి తోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగం లేదని, రాజకీయంగా తనకు భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని.. ఆమె కొంత కాలంగా సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. అసద్‌తో భేటీ అనంతరం కవిత నివాసానికి వెళ్లిన సబిత దాదాపు గంటపాటు భేటీ అయినట్టు సమాచారం.  

ఫలించని బుజ్జగింపు యత్నాలు
తాజా పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ ప్రముఖుల సబితను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్‌ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు సబిత నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా.. ఈ బుజ్జగింపులు ఫలించలేదని తెలిసింది.

మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ..
ఆదివారం ఒక్క రోజే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో.. మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వీరి బాటలోనే వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒక గిరిజన ఎమ్మెల్యేతో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరొకరు ఉన్నారని, వారు బుధవారం లోపు నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నేతలతో వీరి సంప్రదింపులు పూర్తయ్యాయని, నేడో, రేపో లేఖలు కూడా వస్తాయంటున్నారు. వీరి తర్వాత మరో ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్‌లు వెళ్లిపోనున్న నేపథ్యంలో.. పార్టీలో సీతక్క ఒక్కరే ఏకైక మహిళా ఎమ్మెల్యేగా మిగలనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement