మూడుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ వివరాలతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వారి సమగ్ర డేటా చోరీకి గురైన కేసులో లోతుకెళ్లే కొద్దీ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను.. విదేశాల నుంచి కంట్రోల్ చేస్తున్నట్లుగా బయటపడింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటంతోనే ఈ కంపెనీలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించటం.. చివరకు విదేశాల్లోని కంపెనీయే మెజారిటీ వాటాను సొంతం చేసుకోవటం.. అలాంటి కంపెనీ చేతికి ఏపీ, తెలంగాణ ప్రజల డేటా మొత్తం చిక్కటం చూస్తుంటే ఇదెంత పెద్ద కుట్రో తేలిగ్గానే
అర్థమవుతుంది. ఆ వివరాలు చూస్తే..
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ 2010లో ఆరంభమయింది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు వెదుకుతున్న దాకవరం అశోక్.. ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థగా చెప్పుకొనే ఐటీ గ్రిడ్స్‌కు 2014 వరకు పెద్దగా వ్యాపారమేమీ లేదు. 2014లో మాత్రం అనూహ్యంగా ఈ కంపెనీలోకి రూ.12,78,524.. అది కూడా డాలర్ల రూపంలో అమెరికా నుంచి పెట్టుబడిగా వచ్చాయి. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్ర చిరునామాతో ఉన్న సాఫ్ట్‌ల్యాబ్స్ అనే సంస్థ ఈ పెట్టుబడి పెట్టి, కంపెనీలో 52% వాటాను సొంతం చేసుకుంది. అప్పటిదాకా ఈ కంపెనీలో అశోక్‌కు 98% వాటా ఉండగా.. అది 46కు తగ్గిపోయింది. ఐటీ గ్రిడ్స్–యూకే పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు మిగిలిన 2% వాటా ఇచ్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్‌ను 2014 మే నుంచి అమెరికా చిరునామాతో ఉన్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థే నియంత్రిస్తోంది.
వ్యాపారం కూడా విదేశీనే!
విశేషమేంటంటే ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ.. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, సేవల ద్వారా రూ.1.41 కోట్లు ఆర్జించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు వెల్లడించింది. ఆ రూ.1.41 కోట్లు కూడా విదేశీ వ్యాపారం నుంచే వచ్చినట్లు తెలియజేసింది. అంటే ఈ లెక్కన 2017 మార్చి వరకూ ఈ కంపెనీకి దేశంలో ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. అలాంటి కంపెనీ చేతికి తెలుగు ప్రజల డేటా మొత్తం చిక్కిందంటే ఏమనుకోవాలి? 2018 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1.45 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని, అందులో రూ.60 లక్షలే విదేశాల నుంచి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అంటే విదేశీ ఆదాయం ఒక్క సంవత్సరంలోనే రూ.1.44 కోట్ల నుంచి రూ.60 లక్షలకు పడిపోయింది. నిజానికి మామూలు కంపెనీల విషయంలో ఇలాంటివి జరగటం అసాధ్యం. కానీ చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభు త్వం కనుసన్నల్లో సాగుతున్న కంపెనీ కనుక ఏదైనా సాధ్యమే అనుకోవాలేమో!!
సరోజనీదేవి.. ఎవరి బినామీ?
ఇన్నాళ్లుగా మెజారిటీ వాటాను తన చేతిలో ఉంచుకుని వస్తున్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థ.. 2018 మధ్యలో తమ వాటాను కె.సరోజనీ దేవి అనే వ్యక్తికి బదలాయించింది. మామూలుగా ఎవరైనా వాటా కొనుగోలు చేసినపుడు ఆ వివరాలు ఆర్వోసీకి సమర్పిస్తూ.. తన భర్త/తండ్రి పేరు వంటి వివరాలతో పాటు చిరునామా కూడా సమర్పించాలి. కానీ ఈ సరోజనీ దేవి వివరాలు ఏ ఒక్క వివరాన్నీ ఆర్వోసీకి సమర్పించలేదు. అసలు ఈ వాటా మొత్తాన్ని ఆమె ఎంత ధరకు కొన్నారు? ఎంత చెల్లించారు? వంటి వివరాలు సైతం అందజేయలేదు. సరికదా.. మెజారిటీ వాటా ఇప్పటికీ విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నియంత్రణలోనే ఉన్నట్లు చూపించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి కీలకమైన సమయంలో ఈ కంపెనీ వాటా చేతులు మారటాన్ని చూసిన వారు.. ఈ సరోజినీదేవి ప్రభుత్వంలోని ముఖ్యనేతలకు బినామీ కావచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాకవరం అశోక్‌ను పోలీసులకు దొరక్కుండా ఏపీ ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని, ఆయన పోలీసుల ముందు హాజరైతే తప్ప.. సరోజనీ దేవికి సంబంధించిన వివరాలు బయటకు రాకపోవచ్చని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా చూసినపుడు తెలుగు ప్రజల కీలక డేటా మొత్తం విదేశీ నియంత్రణలోని సంస్థ చేతుల్లో ఉన్నట్లుగా భావించక తప్పదు.
ఆ ఇద్దరూ రాజీనామా చేశారెందుకో?
వాటాదారులను పక్కనబెడితే ప్రస్తుతం ఐటీ గ్రిడ్స్‌లో దాకవరం అశోక్, ఆయన భార్య దాకవరం శ్రీలక్ష్మీ కుమారి, తోట నరేందర్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే గతేడాది ప్రారంభం వరకు ఈ సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగిన షేక్ మునీర్ బాషా, కాపా బాలాజీలు ఆ తర్వాత రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేశాకే సాఫ్ట్‌ల్యాబ్స్ వాటా చేతులు మారటం ఇక్కడ గమనార్హం. మునీర్ బాషా, బాలాజీ ఇద్దరూ కలిసి ముబాకీ సాఫ్ట్‌వేర్ యాక్సియోమాటిక్ అనే కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతుండగా.. ‘తెలుగు గంగ నేచర్ ప్రొడక్ట్స్’పేరిట మరో కంపెనీని కూడా మునీర్ బాషా నడిపిస్తున్నాడు. వ్యవహారం హద్దులు దాటిపోతోందని, డేటా వ్యవహారం కొంపముంచొచ్చని భావించే ఈ ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసి ఉంటారన్న అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
(మంథా రమణమూర్తి)
Comments
Please login to add a commentAdd a comment