
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగునున్న వేళ బీజేపీ ఎంపీ, ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీలో ముసలం మొదలైందని, ముఖ్యనేతలంతా ఆప్‌ని వీడతారని పేర్కొన్నారు. వీరిలో ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఉన్నారని, ఆయన ఏ క్షణమైన పార్టీని వీడే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ అసెంబ్లీ గడవు ముగుస్తున్న విషయం తెలిసిందే. సోమవారం మనోజ్ తివారి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల లోపు ఆప్‌లో కేవలం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు.
కేజ్రీవాల్ తీరుతో, పార్టీ సిద్దాంతాలతో విసిగిపోయిన అనేక నేతలు ఇప్పటికే గుడ్‌బై చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తామనే నినాదంతో ఆప్‌లో చేరిన ముఖ్యలు మోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్, ఆనంద్ కుమార్, కుమార్ విశ్వాస్‌తో వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారంటూ ఆయన ప్రశ్నించారు. గడిచిన ఏడాది కాలంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడారని, రానున్న కాలంలో ఆప్ ఖాళీ కావడం తప్పదని అభిప్రాయపడ్డారు.
కేజ్రీవాల్ వైఖరితో ఆ పార్టీ నేతలే కాకా ప్రజలు కూడా విసిగిపోయారని విమర్శించారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ విజయం సాధించడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తివారి తెలిపారు. కాగా ఆప్ ముఖ్యనేత, ఎమ్మెల్యే అల్కా లాంబా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందే ఎమ్మెల్యే కపిల్ మిశ్రా కూడా ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు.