
న్యూఢిల్లీ: దేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14వ తేదీకి బదులు డిసెంబర్ 26న జరపాలని కోరుతూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు, ఎంపీ మనోజ్ తివారీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇలా చేస్తే అది సిక్కుల పదో గురువైన గురు గోవింద్ సింగ్ ఇద్దరు కొడుకులకు ఘన నివాళి అవుతుందని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎందరో బాలలు ఎన్నో త్యాగాలు చేశారని, కానీ వారిలో గురు గోవింద్ సింగ్ కుమారులైన జొరావర్ సింగ్, ఫతే సింగ్‌ల త్యాగం గొప్పదన్నారు. 1705వ సంవత్సరంలో డిసెంబర్ 26నే వాళ్లిద్దరు ధర్మాన్ని రక్షించడానికి తమ ప్రాణాలర్పించారన్నారు.
స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని ప్రతి ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోజ్ తివారీ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కు ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ఆయన లేఖాస్త్రం సాధించారన్న వాదనలు వినబడుతున్నాయి. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుంజలో ఉన్నారు. పూర్వాంచల్ వాసులు కూడా ఢిల్లీలో గణనీయంగా ఉన్నారు. (చదవండి: ‘మఫ్లర్'మ్యాన్‌కు ఏమైంది?)