సాక్షి,సిటీబ్యూరో: ముస్లిం ధార్మిక సంస్థగా పురుడు పోసుకున్న మజ్లిస్ –ఏ–ఇత్తేహదుల్–ముస్లిమీన్.....కాలక్రమేణ యావత్ భారతదేశ ముస్లింల పక్షాన గళంగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మల్లేపల్లి స్థానం నుంచి ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం జాతీయ స్థాయికి విస్తరించింది. పార్లమెంట్‌తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర అసెంబ్లీల్లో ప్రాతినిథ్యం వహిస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించకపోయినా ఓటు బ్యాంకు సంపాదించుకోగలిగింది. తాజాగా కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్దమైంది. 1958 మార్చి 2న అబ్దుల్ వాహెద్ ఓవైసీ సారథ్యంలో ఏడు సూత్రాల నిబంధనలతో మజ్లిస్ –ఏ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఆవిర్భవించింది.
ధార్మిక సంస్థగా..
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ పరిపాలన కాలంలో పాలన, సామాజిక కార్యక్రమాల్లో ఇస్లామియా శాసనాలు అమలు జరిగేవి కావు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న పరిమాణాలపై ముస్లిం సముదాయాలను ఒకే తాటి పైకి తీసుకొచ్చి ఇస్లామియా శాసనాలకు అనుగుణంగా పాలన, జీవితాలను నడపాలన్న ఉద్దేశంతో ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేయాలని నవాబ్ బహదూర్ యార్ జంగ్ భావించాడు.1927 నవంబర్ 12న నవాబు మహ్మద్ నవాజ్ ఖాన్ ఇంట్లో బహదూర్ యార్ జంగ్, అబ్దుల్లా షా సాహబ్, ఖదీర్ సిద్ధిఖీ తదితరులు సమావేశమై చర్చించిన అనంతరం మజ్లీస్–ఏ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ముస్లింలను సంఘటితం చేసే) సంస్ధను ఏర్పాటు చేశారు. సంస్థ ద్వారా ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని నియమావళిలో పేర్కొన్నారు. నవాబ్ బహదూర్ యార్ జంగ్ అధ్యతన ఏర్పాటైన ఈ సంస్థకు పదేళ్లలోనే హైదరాబాద్ సంస్థానంలో విశేష ఆదరణ లభించింది. దీంతో 1938 నవాబ్ హషీమ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన విందుకు హాజరైన బహదూర్ యార్ జంగ్‌ను ఆయన సన్నిహితులు హుక్కాలో విషం కలిపి హతమార్చారు. ఆ తర్వాత మజ్లీస్–ఏ–ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడిగా నిజాంకు అనుకూలుడైన రషీద్ తురాబీ ఎన్నికయ్యారు. తురాబీ అధ్యక్షతన నిజాం ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్న సంస్థ ప్రతిష్ట కొద్ది రోజుల్లోనే మసకబారింది.
ఖాసీం రజ్వీ చేతిలో సైనిక సంస్థగా..
1941లో రషీద్ తురాబీ మరణాంతరం నిజాంకు సన్నిహితుడైన ఖాసీం రజ్వీ మజ్లిస్ పగ్గాలు చేజిక్కించుకున్నాడు. అప్పటి నుంచి మజ్లీస్ నిజాంకు పూర్తిగా అనుకూలంగా మారింది. మజ్లీస్ పార్టీ కార్యకర్తలను రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపునకు సాయుధ శిక్షణ,. మరొక గ్రూప్ నిజాం ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం కోసం నియమించారు. స్వాతంత్య్రం అనంతరం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయరాదని నిర్ణయించడంతో, మజ్లీస్ ఆధ్వర్యంలోని సాయు«ధ శిక్షకులను రజాకార్లు (వాలంటరీ సభ్యులు)గా నామకరణం చేసి ప్రతిఘటన చేపట్టారు. 1948లో భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో (పోలీసు యాక్షన్) నిర్వహించి రజాకార్లు, నిజాం సైన్యాన్ని స్వాధీనంలోకి తీసుకోవడంతో ఆపరేషన్ పోలో ముగిసింది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో రజకార్‌ల నాయకుడు ఖాసీం రజ్వీ అరెస్టయ్యాడు. 1956లో విడుదలైన ఖాసీం రజ్వీకి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం గడువును విధించడంతో ఆయన ఒక తెల్లకాగితంపై అబ్దుల్ వహేద్ ఓవైసీకి మజ్లీస్ పగ్గాలు అప్పగించి పాకిస్థాన్ వెళ్లిపోయారు.
రాజకీయ ప్రస్థానం..
♦ 1960 లో మొదటిసారిగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) ఎన్నికల్లో మజ్లీస్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా మల్లేపల్లి స్థానం నుంచి పోటీ చేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. పార్టీ అధ్యక్షులు అబ్దుల్ వహేద్ ఓవైసీ శాసనసభ, పార్లమెంటు, కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ పరాజయం పాలయ్యారు.
♦ 1962 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పత్తర్‌గట్టి నియోజకవర్గం నుంచి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ అభ్యర్ధుల విజయ పరంపర కొనసాగుతూ వచ్చింది.
♦ 2014 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో తమ సత్తా చాటింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సలావుద్దీన్ ఒవైసీ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
♦ 1962 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీతో మజ్లీస్ పార్టీ హైదరాబాద్ కార్పొరేషన్‌లో తన సత్తా చాటుతూనే ఉంది. జీహెచ్‌ఎంసీలో గత పాలకవర్గం రథసారధిగా మజ్లిస్ పార్టీకి చెందిన మాజీద్ హుస్సేన్ వ్యవహరించగా, తాజాగా పాలనా పగ్గాలు పార్టీ చేతుల్లో లేకున్నా.. కీలక భూమిక పోషిస్తోంది.
నిర్భంధాల నడుమ..
1956 లో అబ్దుల్ వహేద్ ఓవైసీ ఎంఐఎం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి రెండేళైనా సంస్థపై ఖాసీం రజ్వీ ముద్ర చెరిగిపోలేదు. దీనికితోడు ప్రభుత్వం నిఘా పెంచడంతో 1958 మార్చి 2న మజ్లీస్–ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీన్ సంస్థను రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మొదటి మహాసభ నిర్వహించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు ప్రభుత్వం పార్టీపై నిషేధం విధించడమేగాక వహేద్ ఓవైసీని అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment