పామిరెడ్డిపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి వనపర్తి: వచ్చే ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కుడి కెనాల్‌పై ఆధారపడి నిర్మిస్తున్న పెద్దమందడి బ్రాంచి కెనాల్ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఇదే మండలం వెల్టూరు, వనపర్తి మండలం చిట్యాలలో నూతనంగా నిర్మించిన మార్కెట్ గోదాములనూ ప్రారంభించారు. అనంతరం పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లిలో జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవని భావించి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చనిపోయిన రైతుల పేర్ల మీద కేసులు వేయించారని విమర్శించారు. రాష్ట్రంలోని రైతాంగం అంతా టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతుండడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. ఏ ఒక్క రైతు వచ్చి పెట్టుబడి పథకం కావాలని అడగకున్నా రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ నేతలకు రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే కోర్టుల్లో వేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారని.. తాము అధికారంలోకి వచ్చాక 6.50 లక్షల ఎకరాలకు అందిస్తున్నామని తెలిపారు. 90% ప్రాజెక్టులను పూర్తి చేశామంటున్న కాంగ్రెస్ నాయకు లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పొలాలకు సాగునీరు అందించలేకపోయారని ప్రశ్నించారు. కృష్ణానది నికరజలాలను పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలతో పాటు నల్లగొండలోని కొంత భాగానికి కేటాయించి నల్లగొండకు కాళేశ్వరం, ఖమ్మంకు గోదావరి నీటిని వాడుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. సభకు ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించారు.
మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేదు
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారని మంత్రి హరీశ్ విమర్శించారు. అదే టీఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment