
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదన్న లోటు మాత్రమే ప్రభుత్వానికి మిగిలిపోయిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని, ఈ మేరకు ఆయన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయపర సమస్యలు తలెత్తడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వానికి ఆ ఒక్క లోటు మాత్రమే మిగిలిందని, మిగతా అన్ని హామీలు నెరవేర్చారన్నారు. విద్యపై ఏటా ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. టీచర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా 2017లో ఎనిమిదివేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికే సగంమంది నియామకాలు సైతంపూర్తయ్యాయని, త్వరలో పూర్తిస్థాయి నియామకాలు చేపడతామన్నారు.