ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్‌ఆర్‌సీపీ నేత శిల్పాచక్రపాణిరెడ్డి
పాములపాడు: వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అందిస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెంచికలపల్లి గ్రామంలో సుంకులమ్మదేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరయ్యారు. వీరిని గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో పాటించాల్సిన విలువలను టీడీపీ కాలరాసిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు డబ్బు ఎరవేసి కొనుగోలు చేశారన్నారు.
తమ అధినేత వెఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని..అందులో భాగంగానే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారన్నారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబే అన్నారు. మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చి న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. బాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు.
విజేతలకు బహుమతులు
హోరాహోరీగా సాగిన బండలాగుడు పందెంలో కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు 2700 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.30,000 గెలుపొందాయి. వైఎస్‌ఆర్‌జిల్లా మల్లాయపల్లె గ్రామానికి చెందిన గోవిందరెడ్డి వృషభాలు 2528 .2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 20,000 , కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు మూడవ బహుమతి రూ.10,000 గెలుపొందాయి. మొదటి బహుమతిని ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు, వైఎస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు రాజశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ చౌడయ్య, ఎస్‌ఐ రాజగోపాల్ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బాలసుబ్బారెడ్డి, రమణారెడ్డి, దాతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment