
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు ఫోన్ చేసినమాట వాస్తవమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ...రాజగోపాల్‌రెడ్డి తనతో ఏం మాట్లాడారనేది తాను బయటకు వెల్లడించనన్నారు. రాజకీయ అంశాలపై తమ ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని, ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ నుంచి ఎవరూ కూడా టీఆర్‌ఎస్, బీజేపీలోకి వెళ్లే ఆలోచన చేయరన్నారు.
తాను మళ్లీ పార్టీ మారతానంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పార్టీకి పూర్తి సమయం కేటాయిస్తానంటూ తాను ఇప్పటికే స్పష్టంగా చెప్పానన్నారు. తనకు ఆ పదవిస్తే పార్టీని బలోపేతం చేస్తానని జగ్గారెడ్డి మరోసారి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలలో గందరగోళ పరిస్థితి లేదని, పార్టీ క‍్యాడర్ చాలా బలంగా ఉందని అన్నారు. నాయకులు అయోమయంలో ఉన్నారే కానీ క్యాడర్ కాదని అన్నారు. రాజకీయాల్లో లోపాలు లేని నాయకుడు ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చని, లోపాలు ఉన్న నాయకులు కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీయేనంటూ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన నిన్న పలువురు కాంగ్రెస్ ముఖ్యలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌లతో పాటు తనతో సన్నిహిత సంబంధాలున్న నేతలతో ఆయన మాట్లాడినట్లు భోగట్టా. అంతేకాకుండా భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలకు అండగా ఉండాలని రాజగోపాల్‌రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా సంఘం... కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక పంపింది.