సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. అవినీతి అక్రమాలకు పాల్పడిన నేతలకు టికెట్లు ఇస్తే దగ్గరుండి ఓడిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే, మంత్రి జవహర్‌కు టికెట్ కేటాయింపుపై కార్యకర్తలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి నుంచీ పార్టీకి సేవలు చేసిన వారికి కాకుండా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యమిస్తున్నారంటూ టీడీపీ సీనియర్ నాయకులు పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీగా ఉన్న తనను ఎమ్మెల్యేగా పోటీ చేయించి.. ఇప్పుడు టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా లేకపోవడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ నేతలో సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పనిచేసిన తనను అవమానిస్తున్నారని ఆయన ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ స్థానం అభ్యర్థి ఎంపికలో తన పేరు లేకపోవడం పట్ల పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో నరసారావు పేట లోక్‌సభ స్థానం నుంచి మోదుగుల గెలుపొందిన విషయం తెలిసిందే.
టీడీపీ మోదులకు టికెట్ ఇవ్వడం లేదా..!
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు చర్చించారు. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా.. ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి.. ఆలపాటి రాజా, తాడికొండ.. తెనాలి శ్రవణ్‌కుమార్‌కు కేటాయించినట్టు సమాచారం. కాగా, గుంటూరు పశ్చిమ స్థానానికి కోవెలమూడి రవీంద్ర, మన్నవ మోహన్ కృష్ణ, చందు సాంబశివరావు, గుంటూరు తూర్పు స్థానానికి మద్దాలి గిరి.. ముస్లిం వర్గానికి చెందిన ఇంకో ముఖ్యనేత పేరు పరిశీలనలో ఉన్నాయి. పత్తిపాడు నియోజకవర్గానికి రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మంళగిరి స్థానానికి కాండ్రు కమల కుటుంబ సభ్యుల్లో ఒకరు, తిరువీధుల శ్రీనివాసరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment