
సాక్షి, కదిరి : దళితులపట్ల అత్యంత అవమానకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు దళిత సంఘాలు, ప్రజలు, ఇటు రాజకీయ నాయకులు చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పోత్సాహం వల్లనే చింతమనేని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కదిరిలో బుధవారం ఆమె అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)
‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చింతమనేనికి ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితుల గురించి అవహేళనగా మాట్లాడారు. స్వయానా సీఎం చంద్రబాబు కూడా దళిత వర్గాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో దళితులే టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతారు’ అని రోజా హెచ్చరించారు.
ఓ ప్రభుత్వ కార్యక్రమంలో దళితులను ఉద్దేశించి చింతమనేని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని మాట్లాడుతూ.. ‘రాజకీయంగా మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే. మీరు దళితులు. వెనుకబడిన వారు. షెడ్యూల్డ్ కాస్ట్‌కు చెందిన వారు. మీకెందుకురా రాజకీయాలు. పిచ్చ......లారా’ అని దుర్భాషలాడారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment