విశాఖలో టీడీపీ పంచాయితీ | MLA Vasupalli Ganesh Has Inner Fight With Rehman In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో టీడీపీ పంచాయితీ

Published Tue, Jul 16 2019 8:54 AM | Last Updated on Tue, Jul 16 2019 12:50 PM

MLA Vasupalli Ganesh Has Inner Fight With Rehman In Visakhapatnam - Sakshi

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌, రెహమాన్‌

సాక్షి, విశాఖపట్నం : సరైన అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా కట్టేసిన నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైఎలా చర్యలు తీసుకోవాలోనని అధికారులు ఓ పక్క మల్లగుల్లాలు పడుతున్నారు.మరోపక్క అదే తెలుగుదేశం కార్యాలయం వేదికగా ఆ పార్టీ నేతలు కుస్తీలు పడుతూ రచ్చకెక్కుతున్నారు.ఎన్నికల ముందు వరకు పార్టీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను తప్పించి నాలుగు నెలల కిందట మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ రెహమాన్‌ను ఆ పదవిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియమించారు.

రెహమాన్‌ నియామకాన్ని తట్టుకోలేని వాసుపల్లి గణేష్‌ అతను అధ్యక్షుడిగా ఉండగా తాను పార్టీ కార్యాలయంలో అడుగేపెట్టనని శపథం చేయడమే కాదు.. అప్పటినుంచి కార్యాలయంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.సరిగ్గా ఆదే అంశం ఆధారంగా ఎమ్మెల్యే వాసుపల్లితో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్‌ భావిస్తున్నారు. ఆ మేరకు షోకాజ్‌ నోటీసులిచ్చేందుకు సిద్ధపడినట్టు తెలుస్తోంది.మరోవైపు టీడీపీ హయాంలో మంత్రిగా అధికారం చెలాయించిన గంటా శ్రీనివాసరావు సైతం.. ఎన్నికల అనంతరం పార్టీ కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. పార్టీ వ్యవహారాలను అసలు పట్టించుకోవడమే మానేశారు.

రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా..  అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్‌మెయిల్‌ రాజకీయంతో విశాఖ నగరంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లకుంటే బాగోదని  మొక్కుబడిగా హాజరవుతున్న శాసనసభ్యులు.. నగరంలో మాత్రం టీడీపీ కార్యాలయానికి సైతం వెళ్ళకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

దాదాపు తొమ్మిదేళ్లు బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికీ వాస్తవ పరిస్థితి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలకు దూరం దూరం.. అన్నట్లుంటున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆ మధ్య శ్రీలంక, ఇప్పుడు అమెరికా యాత్రలో ఉన్న ఆయన గురు, శుక్రవారాల్లో కీలకమైన బడ్జెట్‌ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టేశారు. సోమవారం మాత్రం అసెంబ్లీ హాజరయ్యారు. ఇక ప్రతిపక్ష పార్టీకి కేటాయించే పీఏసీ చైర్మన్‌ పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ మాదేనని భావించే వెలగపూడి రామకృష్ణబాబులు పార్టీ కార్యాలయానికి అడపాదడపా వెళ్తున్నా... మరో సీనియర్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ వ్యవహారశైలి మాత్రం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చాంశనీయమవుతోంది.

పార్టీ కార్యాలయానికి వెళ్ళనంటే వెళ్ళను
వాసుపల్లి గణేష్‌ విశాఖ అర్బన్‌ టీడీపీ అధ్యక్ష పదవిలో దాదాపు ఐదేళ్లు కొనసాగారు. సరిగ్గా ఎన్నికలకు ముందు వాసుపల్లిని తప్పించి మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ ఎస్‌ఎ రెహమాన్‌కు అర్బన్‌ టీడీపీ అధ్యక్ష పదవిని పార్టీ అధినేత చంద్రబాబు కట్టబెట్టారు.  ప్రజారాజ్యంలో కొన్నాళ్ళు మినహా టీడీపీ ఆవిర్భావం నుంచి క్రియాశీలంగా కొనసాగుతున్న రెహమాన్‌ ఈసారి వాసుపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ నియోజకవర్గం సీటు ఆశించారు.

ఒకవేళ తనకు ఇవ్వకున్నా చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న తన సతీమణి షిరీన్‌ రెహమాన్‌కైనా ఇవ్వాలని రెహమాన్‌ పట్టుబట్టారు. అయితే చంద్రబాబు వాసుపల్లికే రెండోసారి టికెట్‌ కేటాయించి.. పార్టీ అర్బన్‌ అధ్యక్ష పదవిని తొలగించి రెహమాన్‌కు కట్టబెట్టారు. దీంతో వాసుపల్లి, రెహమాన్‌ల మధ్య మొదటి నుంచీ ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. ఎన్నికల సమయంలో రెహమాన్‌ తనకు సహకరించలేదని వాసుపల్లి ఆరోపిస్తుంటే.. తన మద్దతు లేకుంటే దక్షిణంలో వాసుపల్లి గెలిచేవారా.. అని రెహమాన్‌ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత నుంచి వాసుపల్లి టీడీపీ కార్యాలయం మెట్లెక్కలేదు. జిల్లాలో పార్టీ ఘోరపరాభవం తర్వాత నగరంలోని పార్టీ కార్యాలయంలో ఐదారుసార్లు నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు ఎన్నికల ముందు సైకిలెక్కిన మాజీ ఎంపీ సబ్బం హరి సహా దాదాపు మిగిలిన నేతలు హాజరైనా వాసుపల్లి అటువైపు తొంగికూడా చూడలేదు.  

నోటీసులిచ్చేందుకు రెహమాన్‌ సిద్ధం?
మూడు నెలలుగాపార్టీ కార్యాలయ మెట్లెక్కని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు పార్టీ నియమావళి ప్రకారం నోటీసులివ్వాలని అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు రెహమాన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీలక సభ్యత్వం కలిగిన వారు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే నోటీసులివ్వవచ్చని, ఆ క్రమంలో సంజాయిషీ అడగాలని రెహమాన్‌ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఇక్కడ వాసుపల్లి వ్యవహారంతో పాటు పార్టీ కార్యాలయ నిర్వహణ భారం, దుస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లాలని, ఈలోగానే వాసుపల్లికి నోటీసులివ్వాలని రెహమాన్‌ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement