సాక్షి, అమరావతి/రేపల్లె: చంద్రబాబు స్వార్థానికి వేదికగా మారిన శాసన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం నూటికి నూరుశాతం సరైందేనని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. గుంటూరు జిల్లా రేపల్లె వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ ప్రజల శ్రేయస్సుకు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చేస్తున్న చట్టాలపై.. పెద్దల సభగా సూచనలు, సలహాలు అందించాల్సింది పోయి.. చంద్రబాబు స్వార్థానికి కేంద్రంగా మారడం అవాంఛనీయమన్నారు. శాసన మండలికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రచారమాధ్యమాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే ఏ నిర్ణయానికైనా ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. మండలిని రద్దు చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసిన మరుక్షణమే తామూ పదవులకు రాజీనామా చేస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.
ఆక్వా ఎగుమతుల పెంపుపై ప్రత్యేక దృష్టి
ఆక్వా రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. 9 జిల్లాల్లో 22 ప్రాంతాల్లో జెట్టీలు, హార్బర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చేపల వేటను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సీఎం జగన్ సూచనల మేరకు రెండు దశల్లో ఫిషింగ్ హార్బర్లు, జెట్టీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. మొదటి దశలో ఓడరేవు, ఉప్పాడ, మచిలీపట్నం, జువ్వలదిన్నె, రెండోదశలో బుదగట్లపాలెం, ఎద్దువానిపాలెం, పూడిమడక, కొత్తపట్నంలలో హార్బర్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ.350 కోట్లు ఖర్చవుతోందని దీనిలో 50 శాతం కేంద్రం, మిగిలిన యాభై శాతం రాష్ట్రం భరించేలా ఈ ఏడాదిలోనే వీటి నిర్మాణాన్ని ప్రారంభింలనేది లక్ష్యంగా సీఎం ఆదేశించినట్టు చెప్పారు. దీంతో పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను రూ.100 కోట్లతో ఆధునికీకరించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. గ్రామాల్లోని మంచి నీటి చెరువుల్లో కేజ్ కల్చర్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తిలాపీ వంటి చేపలను పెంచే ఆలోచనలో ఉన్నట్టు సచివాలయంలో మీడియాకు వెల్లడించారు.
మండలి రద్దు నిర్ణయం సరైందే..
Published Thu, Jan 30 2020 4:36 AM | Last Updated on Thu, Jan 30 2020 7:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment