
సాక్షి, చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప హెచ్చరించారు. రామకుప్పం మండలంలోని బగళనత్తం, ఉన్సిగానిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం హత్యా రాజకీయాల నుంచి ప్రారంభమైందని, వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారన్నారు. అలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఆయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
పింగళి దశరథరామయ్య, వంగవీటి మోహనరంగా, మాధవ రెడ్డి, బాలయోగి తదితర రాజకీయ నాయకుల మరణాలకు గల కారణాలను చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా ఇంకా బాబుకు బుద్ధిరాలేదన్నారు. టీడీపీ సమీక్షా సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు, మచ్చలేని మనిషి మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం భజన ఎందుకని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీకి చెందిన మంత్రులు, డెప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలపై టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని హితవు పలికారు.
జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం జోలికి వస్తే ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని ఎంపీ హెచ్చరించారు. ఇక ఇసుక సమస్య పదిరోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి కుమారుడు భరత్, మండల పార్టీ అధ్యక్షుడు విజలాపురం బాబు రెడ్డి, కో–కన్వీనర్ చంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ జయప్ప, సిద్ధప్పపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment