
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులను పార్లమెంటులో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వొద్దంటూ లోక్‌సభ స్పీకర్‌ను కలసి విజ్ఞప్తి చేయడం ద్వారా టీఆర్‌ఎస్ నేతలు చేసిన తప్పులను అంగీకరించినట్లైందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మొండివైఖరి వల్ల 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవహారశైలిని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.