
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యురాలు, సమాజ్‌వాది పార్టీ నేత జయా బచ్చన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నరేశ్ అగర్వాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో బాధపెట్టినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సినిమాల్లో డ్యాన్స్‌లు చేసే వారితో తనకు పోలికా అంటూ జయా బచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మాటలు బీజేపీని తీవ్ర ఇరకాటంలో పెట్టాయి. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు సమాజ్ వాది పార్టీలో ఉన్న నరేశ్ అగర్వాల్ తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ తనను సినిమా వాళ్లతో, డ్యాన్సులు చేసేవారితో పోల్చేస్థాయికి సమాజ్ వాది పార్టీ తనను దిగజార్చిందని అన్నారు. జయా వల్లనే తనకు ఎస్పీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ మాటలకు తమకు సంబంధం లేదని బీజేపీ దూరం జరిగింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి కూడా ఆయన వ్యాఖ్యలు ఖండించిన నేపథ్యంలో 'నా వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను' అని ఆయన అన్నారు. అయితే, మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లే అని తాము అనుకోవచ్చా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రిగ్రీట్ అంటే ఏమిటో నీకు అర్ధమవుతుందా అంటూ ఎదురు ప్రశ్నించారు.